Skip to main content

జాతీయ స్థాయిలో కాలేజీలు, సీట్లు, చేరికలు ఏటా తగ్గుముఖం.. ఏపీలో మాత్రం ఇలా..

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా బీఈ, బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశాలు తిరోగమనంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రం ఇంజనీరింగ్‌ విద్య పురోగమిస్తోంది.
విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలతో పాటు విద్యార్థులకు అందిస్తున్న పలు సంక్షేమ పథకాలు కూడా ఇందుకు దోహదం చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో ఏటా కాలేజీలు, సీట్ల సంఖ్య తగ్గిపోతుండడమే కాకుండా విద్యార్థుల ప్రవేశాలు కుదించుకుపోతున్నాయి. గత ప్రభుత్వ హయాం వరకు రాష్ట్రంలో కూడా ఇంజనీరింగ్‌ విద్య తిరోగమనంలోనే పయనించింది. అయితే ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం విద్యార్థుల చదువులపై ప్రత్యేక దృష్టి సారించడంతో పరిస్థితి మారింది. ఉన్నత విద్యారంగంలో అనేక సంస్కరణలు తేవడమే కాకుండా బడ్జెట్‌లో అత్యధికంగా నిధులు కేటాయిస్తున్నారు. జగనన్న విద్యాదీవెనతో పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తింపచేయడంతోపాటు వసతి దీవెన ద్వారా చదువుల కోసం విద్యార్థులపై నయాపైసా భారం లేకుండా చేశారు. కరిక్యులమ్‌లో మార్పులు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశ్రమలతో కాలేజీల అనుసంధానం ద్వారా ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి. ఫలితంగా వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం రెండేళ్లలో కాలేజీల్లో చేరికల సంఖ్య గణనీయంగా పెరిగింది.

కాలేజీలు తగ్గినా చేరికల్లో ఏపీ ముందంజ
ఇంజనీరింగ్‌ కోర్సులకు సంబంధించి అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) గణాంకాలను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో బోధపడుతుంది. 2016–17 నుంచి 2020–21 వరకు జాతీయ స్థాయిలో 315 ఇంజనీరింగ్‌ కాలేజీలు మూతపడగా 2,70,385 సీట్లు తగ్గిపోయాయి. ఏపీలోనూ ఈ ఐదేళ్లలో 34 కాలేజీలు మూతపడగా 21,408 సీట్లు తగ్గిపోయాయి. చేరికల విషయానికి వస్తే జాతీయ స్థాయిలో 2016–17 కన్నా 2020–21లో 84,419 సీట్లు తగ్గాయి. ఏపీలో మాత్రం 2016–17 కన్నా 6,941 సీట్లు అదనంగా భర్తీ కావడం విశేషం. టీడీపీ అధికారం నుంచి దిగిపోయిన 2018–19తో పోలిస్తే అదనంగా 8,486 మంది కాలేజీల్లో చేరినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఏపీలో చేరికలు పెరగడానికి కారణాలు
  • కరిక్యులమ్‌లో మార్పులు చేయడం వల్ల విద్యా ప్రమాణాల్లో నాణ్యత పెరిగింది.
  • అప్రెంటిస్‌ ప్రవేశపెట్టడం. ఇంటర్న్‌షిప్‌ ద్వారా నైపుణ్యాలు పెంపొందాయి.
  • పరిశ్రమలతో ఇంజనీరింగ్‌ కళాశాలల అనుసం ధానం ద్వారా విద్యార్థుల నైపుణ్యాలు పెరగడంతోపాటు ఉద్యోగ అవకాశాలు మెరుగయ్యాయి.
  • కన్వీనర్‌ కోటా ఫీజు పూర్తి రీయింబర్స్‌మెంట్‌తోపాటు రీయింబర్స్‌ పరిధిలోకి రాని ఇతర విద్యార్థులకు కూడా భారం లేకుండా మేనేజ్‌మెంట్‌ కోటా ఫీజును ప్రభుత్వం భారీగా తగ్గించింది. విద్యార్థుల చేరికలు పెరగటానికి ఇది కూడా కారణం.

అమ్మాయిలు పెరిగారు
దేశంలో ఇంజనీరింగ్‌ విద్యలో విద్యార్థినుల చేరికలు భారీగా కుదించుకుపోగా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం పెరగడం గమనార్హం. జాతీయ స్థాయిలో 2016–17లో బాలికలు 2,28,165 మంది చేరగా 2020–21 నాటికి 2,09,541కి తగ్గింది. అంటే బాలికల చేరికలు 18,624 మేర తగ్గాయి. అదే ఏపీలో 2016–17లో బాలికల చేరికలు 36,254 ఉండగా 2020–21 నాటికి 38746కి పెరిగాయి. 2492 మంది బాలికలు అదనంగా చేరినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇక 2016–17లో బాలుర చేరికలు జాతీయస్థాయిలో 5,57,797 కాగా 2020–21 నాటికి 65,795 తగ్గడంతో 492002కి కుదించుకుపోయాయి. ఏపీలో మాత్రం 2016–17లో 53,742 మంది చేరగా 2020–21 నాటికి 4,449 అదనపు ప్రవేశాలతో చేరికలు 58,191కి పెరిగాయి. 2018–19తో పోలిస్తే బాలుర చేరికలు 6147, బాలికల చేరికలు 2339 మేర పెరిగాయి.

దేశంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో చేరికలు ఇలా...

సంవత్సరం

కాలేజీలు

మొత్తం సీట్లు

చేరికలు

2016–17

3293

1557110

785962

2017–18

3224

1476128

750320

2018–19

3124

1404640

721963

2019–20

3050

1329339

741142

2020–21

2978

1286725

701543


రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఇలా

సంవత్సరం

కాలేజీలు

మొత్తం సీట్లు

చేరికలు

2016–17

329

172746

89996

2017–18

321

167583

90098

2018–19

305

156166

88451

2019–20

305

154570

93063

2020–21

295

151338

96937


(2021–22 విద్యాసంవత్సరానికి సంబంధించి 280 కాలేజీల్లో 148952 సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది)

రెండేళ్లుగా మెరుగైన ఫలితాలు..
‘రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతోపాటు ఉన్నత విద్యారంగంలో చేపట్టిన కార్యక్రమాలు రాష్ట్రంలో చేరికలు పెరగటానికి ప్రధాన కారణం. కన్వీనర్‌ కోటా మాదిరిగానే 30 శాతం మేనేజ్‌మెంట్‌ కోటా సీట్లకు ఫీజు తగ్గించడం వల్ల రీయింబర్స్‌ లేని విద్యార్థుల చేరికలకు వెసులుబాటు లభించింది. నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇంటర్న్‌షిప్‌ ప్రవేశపెట్టాం. పరిశ్రమలతో అనుసంధానంతో వల్ల విద్యార్థుల ఉద్యోగావకాశాలు మెరుగ య్యాయి. కరిక్యులమ్‌ను కూడా పటిష్టంగా రూపొం దించాం. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు రెండేళ్లుగా తీసుకున్న చర్యలతో దేశంలోనే మెరుగైన ఫలితాలు సాధించగలుగుతున్నాం’
– సతీష్‌చంద్ర, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఉన్నత విద్యాశాఖ

దేశంలోనే ముందంజలో రాష్ట్రం
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యమిస్తూ చేపడుతున్న పలు కార్యక్రమాల ఫలితంగా రాష్ట్రంలో ఉన్నత విద్యారంగం పురోగమన దిశలో పయనిస్తోంది. జాతీయ విద్యా విధానం ‘అఫర్డ్‌బుల్‌’, ‘ఇన్‌క్లూజివ్‌’ అనే అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తోంది. ఆ రెండిటినీ సాధించడంలో దేశంలోనే ఏపీ ముందంజలో ఉన్నట్లు ఏఐసీటీఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర జీఈఆర్‌ గ్రోత్‌రేట్‌ దీనికి అద్దం పడుతోంది. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన తదితర పథకాలతో పిల్లల చదువులపై తల్లిదండ్రులకు ప్రభుత్వం ఊరట కల్పిస్తోంది. నచ్చిన కాలేజీలో, ఎంపిక చేసుకున్న కోర్సులో చేరితే చాలు ప్రభుత్వమే వారి చదువులకయ్యే మొత్తం ఖర్చు భరిస్తోంది. ఈ కార్యక్రమాల ఫలాలు అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, మహిళలకు అందిస్తూ ప్రయోజనం చేకూరుస్తోంది. అన్ని వర్గాలు, కులాలు, మతాల వారు సమాన అవకాశాలు పొందుతున్నారు. రాబోయే రోజుల్లో దేశ సగటు కన్నా రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు ఉన్నతంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు’
– ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి, ఛైర్మన్‌, ఉన్నత విద్యామండలి

కోర్‌ గ్రూపుల్లో తగ్గుతున్న చేరికలు
‘అన్ని రాష్ట్రాల్లో కొన్నేళ్లుగా ఇంజనీరింగ్‌ విద్య ఒకింత ఒడిదుడుకుల్లో ఉంది. కోర్‌గ్రూప్‌ సబ్జెక్టులతో పాటు కొన్ని ఇతర కోర్సులలో చేరికలు నానాటికీ తగ్గిపోతుండడం వల్ల కూడా పలు కాలేజీలు సీట్లు తగ్గించుకోవడం, కోర్సులు రద్దు చేసుకోవడం చేస్తున్నాయి. ప్రవేశాలు నిర్ణీత సంఖ్యలో లేని తరుణంలో కాలేజీలు మూతపడుతున్నాయి. ఏపీలో గతంలో కన్నా చేరికలు కొంతమేర ఆశాజనకంగా ఉన్నాయి. ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ఇందుకు దోహదపడుతున్నాయి. ఇంజనీరింగ్‌ కోర్సులతో ఉపాధి అవకాశాలు ఒకింత ఎక్కువగా ఉండడం, ప్లేస్‌మెంట్లు దొరుకుతుండడం కూడా చేరికలు పెరగడానికి కారణం’
– మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు, ప్రెసిడెంట్, అటానమస్‌ కాలేజెస్‌ అసోసియేషన్‌, ఏయూ రీజియన్‌.
Published date : 10 Aug 2021 05:23PM

Photo Stories