Skip to main content

ఇంటర్వ్యూతో ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ సీట్ల భర్తీ

  • మార్గదర్శకాలుజారీ చేసిన ఏపీ ఉన్నత విద్యా మండలి
  • విద్యార్థుల ఆర్థికస్థితి తెలుసుకునేందుకే ఇంటర్వ్యూలు
  • చెల్లిస్తారనుకుంటేనే సీట్ల కేటాయింపు
  • 23 నుంచి మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీ
  • 15 శాతానికి మించకుండా ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు
హైదరాబాద్: ‘‘ఇంజనీరింగ్ కోర్సుల్లో 30 శాతం మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. విద్యార్థుల ఆర్థిక పరిస్థితులు తెలుసుకొని, వారు ఫీజు చెల్లిస్తారనే నమ్మకం కలిగితేనే సీట్లు ఇస్తారు. యాజమాన్యానికి నమ్మకం కుదరకపోతే సీటు ఇవ్వడానికి నిరాకరించవచ్చు. అయితే అందుకు కారణాలను తెలియజే యాలి’’.. అని ఏపీ ఉన్నత విద్యా మండలి బుధవారం జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈనెల 22 లేదా 23వ తేదీ నుంచి 15 రోజుల పాటు మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించనుంది. దీనికి సంబంధించి విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం ఉన్నత విద్యా వుండలి ప్రత్యేక వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేయునుంది. అలాగే విద్యార్థులు నేరుగా కాలేజీలోనూ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఉన్నత విద్యా మండలి ఈ చర్యలు చేపట్టింది. 5 శాతం ఉన్న ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) కోటాను 15 శాతానికి పెంచింది.

మేనేజ్‌మెంట్ కోటా ప్రవేశాల నిబంధనలు ఇవీ..
  • 30 శాతం మేనే జ్‌మెంట్ కోటా సీట్లలో 15 శాతానికి మించకుండా సీట్లను ఎన్‌ఆర్‌ఐ పిల్లలకు ఇవ్వొచ్చు. అర్హత పరీక్షలో వారు 50 శాతం మార్కులను పొంది ఉండాలి.
  • మిగతా సీట్లను మెరిట్ ఆధారంగా భర్తీ చేయాలి. జేఈఈలో ర్యాంకు సాధించిన విద్యార్థులకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులకు ప్రవేశాలు కల్పించవచ్చు. వారు అర్హత పరీక్ష గ్రూపు సబ్జెక్టుల్లో 45 శాతానికి తగ్గకుండా మార్కులు సాధించి ఉండాలి.
  • ఆ తరువాత ఎంసెట్‌లో అర్హత సాధించిన వారికి మెరిట్ ఆధారంగా కేటాయించాలి.
  • అప్పటికీ సీట్లు మిగిలిపోతే ఇంటర్మీడియెట్ గ్రూపు సబ్జెక్టుల్లో 45 శాతం మార్కులు (రిజర్వేషన్ కేటగిరీ వారికి 40 శాతం) సాధించిన వారికి కేటాయించవచ్చు.
ప్రవేశాల విధానం..
  • ఉన్నత విద్యా మండలి వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తుంది. ప్రతి కళాశాలకు యూనిక్ ఐడీ, పాస్‌వర్డ్ ఇస్తారు. యాజమాన్య కోటా సీట్ల వివరాలను అందులో అప్‌లోడ్ చేయాలి.
  • విద్యార్థులు ఆ వెబ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్థులకు ఎలక్ట్రానిక్ అక్‌నాలెడ్జ్‌మెంట్ వచ్చేలా చర్యలు చేపడతారు.
  • విద్యార్థులు వ్యక్తిగతంగా కాలేజీకి వెళ్లి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. యాజమాన్యం విద్యార్థులకు రసీదు లేదా అక్‌నాలెడ్జ్‌మెంట్ ఇవ్వాలి. నిర్ణీత సమయంలో సీట్ల భర్తీని పూర్తి చేయాలి. విద్యార్థులు ఎన్నికాలేజీల్లోనైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఆ తరువాత మెరిట్ జాబితాలను కాలేజీలకు అందజేస్తారు. యాజమాన్యాలు ఇంటర్వ్యూ చేసి సీట్లు కేటాయిస్తారుు. డబ్బు చెల్లిస్తారనే నమ్మకం కుదరకపోతే సీటు నిరాకరించవచ్చు. నిరాకరణ కారణాలతో ఎంపిక జాబితాలను మండలికి అందజేయాలి.
  • నిర్ణీత ఫీజు కంటే ఎక్కువ ఫీజు వసూలు చేస్తే నిబంధనల ప్రకారం చర్యలు చేపట్టే అధికారం కౌన్సిల్‌కు ఉంటుంది.
Published date : 21 Aug 2014 12:51PM

Photo Stories