Skip to main content

ఇంట్లో కూర్చొని బీటెక్కులా?

సాక్షి, హైదరాబాద్: తరగతులకు హాజరు కాకపోవడమే కాకుండా తగినంత హాజరు లేదన్న కారణంతో తమను పరీక్షలకు అనుమతినించడం లేదంటూ కోర్టునాశ్రయించిన కొందరు విద్యార్థులకు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు చీవాట్లు పెట్టింది.
తరగతులకు రాకుండా ఇంట్లో కూర్చొని బీటెక్ చదువుతామంటే ఎలా? అంటూ ప్రశ్నించింది. ఇలా చదివే చదువులు ఎందుకూ పనికి రావని స్పష్టం చేసింది. పరీక్షకు హాజరు కానివ్వకపోతే మరోసారి అదే తరగతి చదవాల్సి ఉంటుందని, ఇందుకు సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదని హితవు పలికింది. మరోసారి చదివితే గట్టి పునాది పడుతుందని సూచించింది.

ఆదేశించేదెలా: నిబంధనల ప్రకారం నిర్దేశించిన మేర హాజరుశాతం లేకపోయినా పరీక్షలకు అనుమతినించాలంటూ తాము విశ్వవిద్యాలయాన్ని ఎలా ఆదేశించగలమని హైకోర్టు ప్రశ్నించింది. కాలేజీలు ఎగ్గొట్టి బయట తిరుగుతూ తల్లిదండ్రులను ఒత్తిడి గురిచేయడం ఎంత మాత్రం భావ్యం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల మేర 75 శాతం హాజరు ఉండాలని, 65-75 శాతం మధ్య హాజరు ఉన్న పిటిషనర్లకు మినహాయింపునిచ్చే విషయంలో ఓ పదిరోజుల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని విశ్వవిద్యాలయం అకడమిక్ కమిటీని ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలిలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.

గత తీర్పులు ఇదే చెబుతున్నాయి..: తగినంత హాజరు శాతం లేదంటూ బీటెక్ మూడో సంవత్సరం, రెండో సెమిస్టర్ పరీక్ష రాసిన తమను తదుపరి సంవత్సరానికి పంపకపోవడంతోపాటు రెండో సెమిస్టర్ పరీక్ష ఫలితాలను కూడా వెల్లడించడం లేదంటూ పలువురు జేఎన్‌టీయు, హైదరాబాద్‌కు చెందిన పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జీ, హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులను తదుపరి సంవత్సరానికి అనుమతించాలని యూనివర్సిటీని ఆదేశించారు. ఈ ఆదేశాలను సవాలు చేస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ధర్మాసనం ముందు అప్పీలు దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం అక్టోబర్ 30న విచారణ జరిపింది. యూనివర్సిటీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. నిబంధనలు నిర్దేశించిన మేర హాజరు లేకుంటే వారిని తదుపరి సంవత్సరానికి అనుమతించడం సాధ్యం కాదని తెలిపారు. ఇదే విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పులు కూడా ఉన్నాయన్నారు.

తుది నిర్ణయం యూనివర్సిటీలదే..: వాదనల అనంతరం ధర్మాసనం స్పందిస్తూ.. నిబంధనలు అనుమతించకుంటే, అందుకు విరుద్ధంగా తామెలా యూనివర్సిటీని ఆదేశించగలమని విద్యార్థులను ప్రశ్నించింది. హాజరు మినహాయింపు విషయంలో నిర్ణయం యూనివర్సిటీలదేనని స్పష్టం చేసింది. తెలంగాణ ఉద్యమం సమయంలో కొందరికి మినహాయింపునిచ్చి అనుమతించారని, అలాగని ప్రతీ ఏడాది అలా చేయాలంటే ఎలా కుదురుతుంది? అంటూ ప్రశ్నించింది. తరగతులకు హాజరు కాకుండా ఇంట్లో కూర్చొని చదివే చదువుల వల్ల ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించింది.
Published date : 31 Oct 2017 02:25PM

Photo Stories