Skip to main content

ఇంకా.. ఖరారు కానిఇంజనీరింగ్ ఫీజులు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారం చిక్కుల్లో పడింది.
ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, లా, డీఎడ్, ఎంటెక్, ఎం.ఫార్మసీ తదితర వృత్తి విద్యా కోర్సులకు వచ్చే మూడేళ్లకు వసూలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేయకపోవడంతో వివాదాల్లో చిక్కుకుంది. యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు తమకు అనుకూలంగా ఉత్తర్వులు ఇచ్చిందని యాజమాన్యాలు వెల్లడించాయి. ప్రభుత్వం ఫీజులను ఖరారు చేసే వరకు యాజమాన్యాలు ప్రతిపాదించిన ఫీజులను అమలు చేయాలని చెప్పిందని పేర్కొన్నాయి. ఈ ఆదేశాల నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ప్రభుత్వం పడిపోయింది. యాజమాన్యాలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేస్తే తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావిస్తోంది. అందుకే కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై అప్పీల్ చేయాలని నిర్ణయించింది.

అసలేం జరిగిందంటే..:
రాష్ట్రంలోని వృత్తి విద్యా కాలేజీల్లో 2016-17 నుంచి 2018-19 వరకు మూడేళ్లపాటు వసూలు చేయాల్సిన ఫీజులను 2016లో ప్రభుత్వం నియమించిన తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఖరారు చేసింది. ఆ ఫీజులనే గత విద్యా సంవత్సరం వరకు కాలేజీ యాజమాన్యాలు అమలు చేశాయి. కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి వచ్చే మూడేళ్ల పాటు 2019-20 నుంచి 2021-22 వరకు అమలు చేయాల్సిన ఫీజులను ఖరారు చేయాల్సి ఉంది. ఏఎఫ్‌ఆర్‌సీకి చైర్మన్‌ను నియమించకపోవడంతో ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ లేకుండా ఫీజులు ఖరారు చేయడానికి వీల్లేదు. ఆయన నేతృత్వంలోనే ఫీజులను ఖరారు చేస్తే వాటికి చట్టబద్దత ఉంటుంది. ఇందుకు ప్రభుత్వం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ప్రతిపాదన పంపించాల్సి ఉంటుంది. ఆయన ముగ్గురు హైకోర్టు రిటైర్డ్ జడ్జీల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తారు. అందులో ఒకరిని చైర్మన్‌గా నియమించాల్సి ఉంటుంది. ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్‌ను నియమించాలని ఉన్నత విద్యామండలి గతేడాది అక్టోబర్‌లోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం దీన్ని అంతగా పట్టించుకోలేదు. సమస్యలు వస్తాయని ఏఎఫ్‌ఆర్‌సీకి సభ్య కార్యదర్శిగా వ్యవహరించే విద్యా శాఖ కార్యదర్శి ఫీజుల ప్రతిపాదనల కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో 1,248 కాలేజీలు తమ రెండేళ్ల ఆదాయ వ్యయాలు, ప్రతిపాదిత ఫీజుతో దరఖాస్తు చేసుకున్నాయి. వాటన్నింటినీ ప్రాసెస్ చేసి, ఫీజులను ఖరారు చేసే నాటికి ప్రభుత్వం ఏఎఫ్‌ఆర్‌సీకి చైర్మన్ నియామకానికి చర్యలు చేపడుతుందని అధికారులు భావించారు. కానీ ఇంతవరకు చైర్మన్ నియామకానికి చర్యలు చేపట్టలేదు. ఎంసెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇంజనీరింగ్ ప్రవేశాలకు నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో యాజమాన్యాలు తమకు ఫీజులను పెంచాలని, ప్రభుత్వం చర్యలు చేపట్టట్లేదంటూ ఆరు కాలేజీ యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో ప్రభుత్వం వెంటనే చైర్మన్‌ను నియమించి ఫీజులు ఖరారు చేయాలని, అప్పటివరకు సదరు ఆరు కాలేజీలు ప్రతిపాదించిన ఫీజును అమలు చేయాలని పేర్కొన్నట్లు కాలేజీ యాజమాన్యాల సంఘం ప్రతినిధి వెల్లడించారు.

భారీ మొత్తంలో ఫీజు ప్రతిపాదనలు..
హైకోర్టు ఆ ఉత్తర్వులను ఆ ఆరు కాలేజీలకే ఇచ్చినా, దాన్ని అసరాగా చేసుకొని మిగతా కాలేజీలు కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమయ్యాయి. అదే జరిగితే ఫీజుల వ్యవహారం ప్రభుత్వానికి తలనొప్పిగా మారే పరిస్థితి ఉంది. ప్రస్తుతం కొన్ని టాప్ కాలేజీలైతే వార్షిక ఫీజును రూ. 1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పైగా ప్రతిపాదించాయి. ఇంత మొత్తంలో ఫీజులను అమలు చేస్తే ప్రభుత్వం ఇబ్బందుల పాలుకాక తప్పదు. అందుకే కోర్టు ఇచ్చిన ఆదేశాలపై అప్పీల్‌కు వెళ్లాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ఏఎఫ్‌ఆర్‌సీ చైర్మన్ నియామకం విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది. వీలైనంత త్వరగా ఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ను నియమించి ఫీజులను ఖరారు చేస్తే ఏ సమస్యలు ఉండవని అధికారులు అంటున్నారు.
Published date : 21 Jun 2019 04:52PM

Photo Stories