ఇంజనీరింగ్‌పై యువతకు నో ఇంట్రస్ట్! : టీఎస్ ఉన్నత విద్యా మండలి
నాలుగేళ్లలో 33 కాలేజీలు మూత..
ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. మేనేజ్‌మెంట్ కోటాలో 2016 నుంచి 2018 వరకు ప్రవేశాల్లో పెద్దగా తగ్గుదల లేనప్పటికీ 2018 నుంచి 2019కి వచ్చేసరికి మాత్రం భారీగానే ప్రవేశాలు తగ్గిపోయాయి. కన్వీనర్ కోటా, మేనేజ్‌మెంట్ కోటా కలుపుకొని 2016 సంవత్సరంలో రాష్ట్రంలోని 220 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,04,758 సీట్ల భర్తీకి యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపునిచ్చాయి. అదే 2019 సంవత్సరం వచ్చేసరికి 187 కాలేజీల్లోని 93,790 సీట్లకే అనుబంధ గుర్తింపును ఇచ్చాయి. అంటే నాలుగేళ్లలో 33 కాలేజీలు మూతపడగా, 10,968 సీట్లు రద్దయ్యాయి. మరోవైపు విద్యార్థులు చేరకపోవడంతో ప్రవేశాలు తగ్గిపోయాయి. 2016లో 73,686 మంది విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరగా, 2019లో 62,744 మంది మాత్రమే ఇంజనీరింగ్‌లో చేరారు. ఇందులో కన్వీనర్ కోటాలో చేరే విద్యార్థుల సంఖ్యే ఎక్కువగా తగ్గింది. 2016లో 54,064 నుంచి 46,134కు పడిపోయింది. గడిచిన రెండేళ్ల ప్రవేశాలను పరిశీలిస్తే మాత్రం మేనేజ్‌మెంట్ కోటాలోనూ చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది.
డిమాండ్ లేని కోర్సులకు దూరం..
ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్న కోర్సులకే తల్లిదండ్రులు, విద్యార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. నాణ్యత ప్రమాణాలు పాటించే కాలేజీల్లోనే చేర్చేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ప్రమాణాలు పాటించని కాలేజీలు క్రమంగా మూతపడుతున్నాయి. విద్యార్థులు కూడా తమ ఆలోచనను మార్చుకొని టైంపాస్ కోసం ఏదో ఓ కోర్సులో చేరాలనుకోవడం లేదని విద్యావేత్తలు చెబుతున్నారు. ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలు లేకపోతే వాటిల్లో చేరేందుకే అస్సలు ఇష్టపడటం లేదని వారంటున్నారు. ఇలాంటి కారణాలతోనే ఏటా 8 నుంచి 15 వరకు కాలేజీలు మూత పడుతూనే ఉన్నాయి. ఈసారి కూడా 10 కాలేజీలు మూసివేత కోసం జేఎన్‌టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి. మరికొన్ని కాలేజీలు డిమాండ్ లేని కోర్సుల రద్దుకు దరఖాస్తు చేసుకున్నాయి. దీంతో ఈసారి మరో 7 వేల వరకు సీట్లు తగ్గిపోవచ్చు. అయితే మార్కెట్‌లో డిమాండున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డాటా, బ్లాక్ చైన్ టెక్నాలజీ వంటి కోర్సుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. అయితే అవి ఇప్పటివరకు అన్ని కాలేజీల్లో లేవు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి మాత్రం జేఎన్‌టీయూలోని అన్ని కాలేజీల్లో ఆయా కోర్సులను ప్రవేశపెట్టేందుకు యూనివర్సిటీ ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో 3 వేల వరకు సీట్లలో ఆయా కోర్సులకు అనుమతి ఇచ్చే అవకాశముంది. అయినా 2020 ప్రవేశాల్లో 4 వేల వరకు సీట్లు తగ్గే పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరోవైపు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. ప్రవేశాల్లో తగ్గుదలే తప్ప పెరుగుదల కనిపించడం లేదు.
సంవత్సరాల వారీగా వివిధ కోర్సుల్లో ప్రవేశాల పరిస్థితి ఇదీ
ఇంజనీరింగ్‌లో.. | |||||||
సంవత్సరం | కాలేజీలు | మొత్తంసీట్లు | కన్వీనర్ | మేనేజ్‌మెంట్ | మొత్తంభర్తీ | ఖాళీ | భర్తీ శాతం |
2016 | 220 | 1,04,758 | 54,064 | 19,622 | 73,686 | 31,072 | 70.34 |
2017 | 212 | 98,021 | 50,258 | 18,095 | 68,353 | 29,668 | 69.73 |
2018 | 202 | 97,109 | 48,669 | 19,469 | 68,138 | 28,971 | 70.17 |
2019 | 187 | 93,790 | 46,134 | 16,610 | 62,744 | 31,046 | 66.90 |
ఫార్మసీలో.. | |||||||
సంవత్సరం | కాలేజీలు | మొత్తంసీట్లు | కన్వీనర్ | మేనేజ్‌మెంట్ | మొత్తంభర్తీ | ఖాళీ | భర్తీ శాతం |
2016 | 123 | 10,846 | 5,742 | 3,528 | 9,270 | 1,576 | 85.47 |
2017 | 131 | 11,928 | 6,759 | 2,797 | 9,556 | 2,372 | 80.11 |
2018 | 127 | 11,285 | 6,744 | 2,034 | 8,778 | 2,507 | 77.78 |
ఎంబీఏ, ఎంసీఏలో.. | |||||||
సంవత్సరం | కాలేజీలు | మొత్తంసీట్లు | కన్వీనర్ | మేనేజ్‌మెంట్ | మొత్తంభర్తీ | ఖాళీ | భర్తీ శాతం |
2016 | 305 | 35,370 | 22,479 | 7,779 | 30,258 | 5,112 | 85.55 |
2017 | 304 | 35,446 | 21,783 | 8,099 | 29,882 | 5,564 | 84.30 |
2018 | 325 | 36,706 | 21,776 | 7,593 | 29,369 | 7,337 | 80.01 |
పాలిటెక్నిక్‌లో.. | |||||||
సంవత్సరం | కాలేజీలు | మొత్తం సీట్లు | కన్వీనర్ | మేనేజ్‌మెంట్ | మొత్తంభర్తీ | ఖాళీ | భర్తీ శాతం |
2016 | 207 | 50,721 | 36,983 | 0 | 36,983 | 13,738 | 72.92 |
2017 | 187 | 44,451 | 31,742 | 0 | 31,742 | 12,709 | 71.41 |
2018 | 170 | 39,470 | 29,310 | 0 | 29,310 | 10,160 | 74.26 |