Skip to main content

ఇంజనీరింగ్‌పై ఫిబ్రవరి 26న ఉన్నత స్థాయి సమావేశం

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ విద్య పరిస్థితులు, అమలు చేయాల్సిన మార్పులు, మార్కెట్ డిమాండ్, అందుకనుగుణంగా తీసుకొచ్చే కొత్త కోర్సులకు అందించాల్సిన సహకారంపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది.
ఇందులో భాగంగా అధికారులు, పారిశ్రామిక రంగాలకు చెందిన నిపుణులతో ఫిబ్రవరి26వ తేదీన ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనుంది. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ఆర్.లింబాద్రి, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కొత్త కాలేజీలు, కొత్త కోర్సుల అమలుకు రానున్న రెండేళ్లలో తీసుకురావాల్సిన మార్పులు, అందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలి, యూనివర్సిటీలు చేపట్టాల్సిన చర్యలు, కొత్త కోర్సులకనుగుణంగా అమలు చేయాల్సిన శిక్షణ కార్యక్రమాలను నివేదికలో పొందుపరచనున్నారు. ఈ నివేదికను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కి కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించనుంది.
Published date : 25 Feb 2020 01:46PM

Photo Stories