Skip to main content

ఇంజనీరింగ్‌లో సగం సీట్లకు కోత

సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ సీట్లలో వచ్చే విద్యా సంవత్సరంలో సగానికిపైగా సీట్లకు కోతపడే అవకాశాలున్నాయి.
పలు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ సీట్లు భర్తీ కాకుండా భారీగా మిగిలిపోతున్న నేపథ్యంలో జాతీయ సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) సమీక్ష నిర్వహించి ఈ అభిప్రాయానికి వచ్చినట్లు ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొంటున్నాయి. ఏఐసీటీఈ ఛైర్మన్ అనిల్ డి సహస్రబుద్ధి ఇటీవల చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ ఇంజనీరింగ్ సీట్లకు సంబంధించి నియంత్రణ విధానాన్ని అమలు చేయనున్నట్లు పేర్కొనడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పరిస్థితిపై ఉన్నత విద్యామండలి అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రంలో కూడా వచ్చే విద్యాసంవత్సరానికి సగానికి పైగా సీట్లకు కోతపడే అవకాశాలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు.

సదుపాయాల్లేకున్నా అనుమతులు...:
రాష్ట్రంలోని చాలా కాలేజీల్లో బోధన, బోధనేతర సిబ్బంది, ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలు లేవని ఇంతకు ముందే ఉన్నత విద్యామండలికి అనేక ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించి సదుపాయాలు లేని కాలేజీలను ప్రస్తుత విద్యా సంవత్సరంలో కౌన్సెలింగ్‌కు అనుమతించరాదని ముందు భావించారు. కానీ కాలేజీలను తనిఖీలు చేయలేకపోవడంతో అన్ని కాలేజీలను కౌన్సెలింగ్‌కు అనుమతిచ్చారు. వచ్చే విద్యాసంవత్సరం యాజమాన్యాలు ఏఐసీటీఈ ఆమోదానికి దరఖాస్తు చేసే సందర్భంలో సీట్ల సంఖ్యను మండలి కుదించనుందని అధికారవర్గాలు వివరించాయి. కాలేజీలకు అనుమతుల విషయంలో ఇప్పటివరకు ఏఐసీటీఈకి శాస్త్రబద్ధమైన విధానమేదీ లేదని, యాజమాన్యాలు ఇచ్చే పత్రాల ఆధారంగా అనుమతులు ఇచ్చేయడంవల్లనే ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయని పేర్కొంటున్నారు. సిబ్బంది, భవనాలు, ల్యాబ్‌లు లేకపోయినా యాజమాన్యాలు పలు కోర్సులకు ఏఐసీటీఈ నుంచి అనుమతులు తెచ్చుకొని కాలేజీలను ప్రారంభిస్తున్నాయి. కాలేజీల్లోని సదుపాయాలపై తనిఖీలు చేయాల్సిన యూనివర్సిటీల తనిఖీ బృందాలు ముడుపులకు ఆశపడి వాస్తవాలను మరుగుపర్చి తప్పుడు నివేదికలు ఇస్తున్నాయి. దీంతో బోధకులు, సదుపాయాలు లేకపోయినా పలు కోర్సులతో కాలేజీలను ప్రారంభిస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, ఈఈఈ, మెకానికల్, ఐటీ, బయోటెక్నాలజీ ఇలా పలు రకాల కోర్సులతో సీట్లకు అనుమతులు పొందుతున్నాయి. ఆయా కోర్సుల్లో విద్యార్థులు చేరకపోయినా కాలేజీలు వాటిని యథాతథంగా కొనసాగిస్తున్నాయే తప్ప రద్దుచేసుకోవడం లేదు. దీంతో ఏటా ఇంజనీరింగ్ సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. ఒక్క ఏపీలోనే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి.

ఏటేటా పెరిగిన సీట్లు...:
దేశవ్యాప్తంగా 2006-07లో 6,59,717 ఇంజనీరింగ్ సీట్లుంటే 2007-08లో ఆ సంఖ్య 7,01,214కు పెరిగింది. 2009-10 నాటికి అది 10,93,380కి పెరగ్గా 2013-14కి 16,34,596కి చేరింది. తాజాగా ఈ సంఖ్య 20 లక్షలకు పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ సీట్లను సగానికి సగం తగ్గించాలని ఏఐసీటీఈ భావిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో సీట్లు మిగిలిపోతున్నందున సీట్ల సంఖ్య తగ్గించినా విద్యార్థులకు నష్టం ఉండదని ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏపీలో పరిస్థితి ఇదీ...:
ఏపీలో 2014లో 306 ప్రైవేటు కాలేజీలు, 17 యూనివర్సిటీ కాలేజీల్లో మొత్తం 1,65,080 సీట్లున్నాయి. ఇందులో 62,740 సీట్లే భర్తీ అయ్యాయి. ప్రైవేటు కాలేజీల్లోని 53,952 సీట్లు, యూనివర్సిటీ కాలేజీల్లోని 40 సీట్లు మిగిలిపోయాయి. ఇది కన్వీనర్ కోటా కాగా మేనేజ్‌మెంటు కోటాలో సగానికి పైగా మిగిలిపోయాయి. ఈ ఏడాది కూడా 1,51,830 సీట్లలో 69,108 కన్వీనర్ కోటా కింద భర్తీ అయ్యాయి. ప్రస్తుతం మేనేజ్‌మెంటు కోటా సీట్ల భర్తీ తుది దశకు చేరుకుంది. ఈ కోటాలోనూ సీట్లూ భారీగానే మిగిలిపోనున్నాయని అడ్మిషన్ల కమిటీ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ఎంసెట్‌లో ఒక్క విద్యార్థీ చేరని కాలేజీలు 14 ఉండగా 150 లోపు విద్యార్థులు చేరిన కాలేజీలు 127 ఉన్నాయి. కన్వీనర్, మేనేజ్‌మెంటు కోటాల్లో మిగిలిపోయే సీట్ల సంఖ్య 70 వేలు ఉండొచ్చని పేర్కొంటున్నారు. ఇలా మిగిలిపోయే సీట్లన్నిటికీ ఏఐసీటీఈ తీసుకొనే నిర్ణయంతో వచ్చే ఏడాది కోతపడవచ్చని ఉన్నత విద్యా మండలివర్గాలు చెబుతున్నాయి.
Published date : 02 Oct 2015 03:53PM

Photo Stories