Skip to main content

ఇంజనీరింగ్‌లో ఏటేటా తగ్గుతున్న ప్రవేశాలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య ఏటేటా పడిపోతోంది.
నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీలు, అధ్యాపకులు లేకపోయినా కాలేజీలను కొనసాగిస్తున ్న యాజమాన్యాల వైఖరితో ఇంజనీరింగ్ చేసినా ప్రయోజనం లేకుండా పోతోందన్న తల్లిదండ్రుల నిరాసక్తత కారణంగా ఇంజనీరింగ్ విద్యకు ఆదరణ తగ్గుతోంది. ఐదేళ్ల కిందట కన్వీనర్ కోటాలో 69,690 మంది విద్యార్థులు కాలేజీల్లో చేరితే గత ఏడాది (2014-15) కన్వీనర్ కోటాలో 55,925 మంది విద్యార్థులే చేరారు. ఐదేళ్ల కిందట తక్కువ సీట్లు ఉన్నా.. సరిపడ విద్యార్థులు చేరారు. ఇక 2010 తరువాత నుంచి కాలేజీల్లో సీట్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నా చేరుతున్న విద్యార్థుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఈసారి ఎంతమంది విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేరుతారన్న అంశం ఆసక్తిగా మారింది.

ఎట్టకేలకు ప్రక్షాళన దిశగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంజనీరింగ్ విద్య ప్రక్షాళన దిశగా అడుగులు పడ్డాయి. గత ఏడాది జేఎన్‌టీయూహెచ్ పరిధిలోని 288 కాలేజీల్లో కేవలం 125 కాలేజీలకే అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ఫ్యాకల్టీ, ల్యాబ్‌లలో లోపాలున్న 163 కాలేజీలకు గుర్తింపు ఇవ్వలేదు. చివరకు సుప్రీంకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నా.. కోర్టు ఆదేశాలతో చేపట్టిన రెండోసారి తనిఖీల్లో ఆ కాలేజీల్లో లోపాలు ఉన్నట్లు తేలిపోయింది. ఈ విద్యా సంవత్సరంలోనూ 220 కాలేజీలకు జేఎన్‌టీయూహెచ్ అనుమతి ఇచ్చినా.. లోపాల కారణంగా చాలా కాలేజీల్లో అనేక కోర్సులకు కోత పెట్టింది. చివరకు ఈసారి యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో వెబ్‌కౌన్సెలింగ్‌లో అన్నింటినీ చేర్చాల్సి వచ్చింది. అయితే సోమవారం నుంచి చేపట్టే తనిఖీల్లో లోపాలు లే నట్టు తేలితేనే వాటికి అనుబంధ గుర్తింపు వస్తుంది. లేదంటే అంతే సంగతులు. ఇందులో విచిత్రం ఏమిటంటే కోర్టుకు వెళ్లిన 121 కాలేజీల్లో 73 కాలేజీలు తమకు ముందుగా ఇచ్చిన సీట్లు చాలని, తమ కాలేజీల్లో మళ్లీ తనిఖీలు అవసరం లేదని లేఖలు ఇవ్వడంతో కాలేజీల్లో లోపాలు ఉన్నాయన్నది వాస్తవమేనని తేలిపోయింది. మరోవైపు బోధన ప్రమాణాలపైనా జేఎన్‌టీయూహెచ్ దృష్టి పెట్టింది. పీహెచ్‌డీలు కూడా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగానే చేపట్టాలని నిర్ణయించినట్లు జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎన్‌వీ రమణరావు పేర్కొన్నారు.

ఆప్షన్లు ఇచ్చింది సగం కంటే తక్కువే
ఈసారి ఎంసెట్‌లో 91 వేల మంది విద్యార్థులు ర్యాంకులు సాధిస్తే 66,503 మంది మాత్రమే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు ఒకటో ర్యాంకు నుంచి 44 వేల ర్యాంకు వరకు విద్యార్థులకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించగా 30,279 మందే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్నారు. ఇక 44,001వ ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకున్న వారు ఎంతమంది ఆప్షన్లు ఇచ్చుకుంటారో ఈ నెల 21న సాయంత్రం 6 గంటలకు తేలనుంది.

విద్యార్థుల ప్రవేశాలు ఇలా..

సంవత్సరం

మొత్తం సీట్లు

కన్వీనర్ కోటా

భర్తీ అయినవి

మిగిలిన సీట్లు

2010-11

1,24,664

87,793

69,690

18,103

2011-12

1,39,074

97,895

62,659

35,236

2012-13

1,59,259

1,12,055

62,516

49,539

2013-14

1,57,977

1,11,443

57,480

53,963

2014-15

1,57,102

1,10,634

55,925

54,709

Published date : 20 Jul 2015 03:21PM

Photo Stories