Skip to main content

ఇంజనీరింగ్‌లో ఏడాది గరిష్ట ఫీజు 1.58 లక్షలు

సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సుకు ఏడాది గరిష్ట ఫీజు రూ.1.44 లక్షల నుంచి రూ.1.58 లక్షల మధ్య నిర్ధారిస్తూ అఖిలభారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ఆదేశాలు జారీచేసింది.
ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాలను గురువారం విడుదల చేసింది. రెండేళ్ల ఎంబీఏ కోర్సుకు ఏడాదికి గరిష్ట ఫీజును రూ.1.57 లక్షల నుంచి రూ.1.71 లక్షల వరకు నిర్ణయించింది. ఈ గరిష్ట ఫీజు ఏటా బీ ఆర్క్ (ఆర్కిటెక్చర్)లో 2.05 లక్షల నుంచి 2.25లక్షలు, బీ ఫార్మా కోర్సులకు రూ.1.41 లక్షల నుంచి రూ.1.55 లక్షల వరకు ఎంసీఏ కోర్సులకు రూ.1.57 లక్షల నుంచి రూ.1.70 లక్షల వరకు ఉండొచ్చని నిర్ధారించింది. ఎంటెక్ కోర్సుల్లో ఏడాది గరిష్ట ఫీజు రూ.2.31 లక్షల నుంచి 2.51 లక్షలుగా నిర్ణయించింది. ఆయా విద్యాసంస్థలు నెలకొన్న ప్రాంతాలు, నిర్వహణ ఖర్చులను అనుసరించి ఫీజులను ఆయా రాష్ట్రాల ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండళ్లు (ఏఎఫ్‌ఆర్‌సీ)లు నిర్ణయించాలని ఏఐసీటీఈ పేర్కొంది. స్వయం ప్రతిపత్తి(అటానమస్) విద్యాసంస్థలు ఈ గరిష్ట ఫీజుల మొత్తంలో 10శాతం, అక్రిడేటెడ్ విద్యాసంస్థలు 20 శాతం చొప్పున పెంచుకోవచ్చు. జాతీయస్థాయిలో ఉన్నత సాంకేతిక, వృత్తివిద్యా కోర్సులకు సంబంధించి కేంద్రం ఏర్పాటుచేసిన జస్టిస్ శ్రీకృష్ణ నేతృత్వంలోని ‘నేషనల్ ఫీజుల కమిటీ’ గరిష్ట ఫీజులను నిర్ణయిస్తూ గతేడాది ఆగస్టులో ఇచ్చిన నివేదికను కేంద్రమానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆమోదించడంతో ఏఐసీటీఈ ఆదేశాలు జారీ చేసింది. నిర్ధారిత గరిష్ట ఫీజులకు మించి విద్యాసంస్థలు వసూలు చేయడానికి వీల్లేదని, భిన్నంగా వ్యవహరిస్తే ఆయా సంస్థల గుర్తింపును రద్దుచేయడంతో పాటు కాలేజీలను మూసివేస్తామని హెచ్చరించింది. జస్టిస్ శ్రీకృష్ణ సారథ్యంలో పది మంది సభ్యులతో 2014లో ఏర్పాటైన కమిటీ ఈ గరిష్ట ఫీజులను నిర్ణయించి ఇచ్చిన నివేదిక సిఫార్సులను 2016-17 నుంచి అమల్లోకి తేవాలని ఆదేశాలు జారీచేసింది.
Published date : 08 Apr 2016 01:48PM

Photo Stories