Skip to main content

ఇంజనీరింగ్‌లో ‘బతుకు విద్య’

ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కోర్సులు<br/> కొత్తగా ఆరు సబ్జెక్టులు
మూడో ఏడాది ఫస్ట్ సెమిస్టర్‌లో ప్రారంభం

హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో బతుకు విద్యను నేర్పించేందుకు జేఎన్‌టీయూ-హెచ్ చర్యలు ప్రారంభించింది. తమ పరిధిలోని 326 ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త సబ్జెక్టులను ప్రవేశ పెట్టడం ద్వారా సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఏటా దాదాపు 15 వేల మందికి ఉద్యోగాలు లభించేలా ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ విద్యా సంవత్సరం నుంచే దీనిని అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్)తో ఒప్పందం చేసుకుంది. మొదట ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ), కంప్యూటర్ సైన్స్ (సీఎస్‌సీ) కోర్సుల్లో కొత్త సబె ్జక్టుల ప్రవేశానికి జేఎన్‌టీయూ-హెచ్ చర్య చేపట్టింది. భవిష్యత్తులో మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభించే కొత్త సబ్జెక్టులను వివిధ కోర్సుల్లో ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఇంజనీరింగ్ కోర్సుల సిలబస్ మార్పుల్లో భాగంగా ఈ కొత్త సబ్జెక్టులను అందుబాటులోకి తీసుకువస్తోంది.

నాస్కామ్ తమ పరిధిలోని కంపెనీల్లో మావన వనరులు అవసరాలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. డిజైన్ ఇంజనీర్, జూనియర్ డేటా అసోసియేట్, సెక్యూరిటీ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, అసోసియేట్ అనలిటిక్స్, టెస్ట్ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ వంటి సబ్జెక్టుల్లో నిఫుణుల అవసరాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. ఆయా రంగాల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించడం ద్వారా కంపెనీల అవ సరాలు తీరడంతోపాటు యువత ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చని భావిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం విద్యా ప్రమాణాల పెంపుతోపాటు ఉద్యోగ అవకాశాలున్న కోర్సులకు సంబంధించిన వివరాలపై నాస్కామ్‌తో చర్చించింది. అంతేకాకుండా తాము చెప్పిన సబ్జెక్టులను ప్రవేశపెడితే తమ పరిధిలోని సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఆ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని నాస్కామ్ పేర్కొంది.

ఉపాధి అవకాశాలు కల్పించే పలు సబ్జెక్టులు, కోర్సులను ప్రవేశపెట్టేందుకు జేఎన్‌టీయూ-హెచ్ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో మొదట డిజైన్ ఇంజనీర్, జూనియర్ డేటా అసోసియేట్, సెక్యూరిటీ అనలిస్ట్, అసోసియేట్ అనలిటిక్స్ సబ్జెక్టులను మొదటి దశలో ప్రవేశ పెడుతోంది. ఆ తరువాత రెండో దశలో టెస్ట్ ఇంజనీర్, సాఫ్ట్‌వేర్ డెవలపర్ సబ్జెక్టులను ప్రవేశపెట్టనుంది. ఇక భవిష్యత్తులో స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, వెబ్ టెక్నాలజీస్, జావా ప్రోగ్రామింగ్‌లో రెండు రకాల కోర్సులు, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా అనలిటిక్స్, నెట్ వర్క్ ప్రోగ్రామింగ్, సాకెట్ ప్రోగ్రామింగ్ కోర్సులను ప్రవేశ పెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఏప్రిల్ 15 నుంచి శిక్షణ
కొత్త సబ్జెక్టులకు సంబంధించి బోధనా సిబ్బంది(ఫ్యాకల్టీ)కి శిక్షణ ఇవ్వనున్నారు. మొదట 100 మందికి శిక్షణ ఏప్రిల్ 15 నుంచి ప్రారంభం కానుందని సమాచారం. ఐటీ, సీఎస్‌సీ కోర్సుల్లో కోర్ సబ్జెక్టులతోపాటు ఎలెక్టివ్ సబ్జెక్టుల్లో భాగంగా ఈ కొత్త సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకునేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఐటీ విభాగం ప్రొఫెసర్ విజయకుమారి పేర్కొన్నారు. బీటెక్ మూడో సంవత్సరంలోని మొదటి సెమిస్టర్, రెండో సెమిస్టర్, నాలుగో సంవత్సరంలోని మొదటి సెమిస్టర్, రెండో సెమిస్టర్‌లలో ఈ కొత్త సబ్జెక్టులను విద్యార్థులు చదువుకోవచ్చు.
Published date : 31 Mar 2015 11:52AM

Photo Stories