Skip to main content

ఇంజనీరింగ్‌లో ఔట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ !

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో ఔట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అమలు కోసం కేంద్రం చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఓపెన్ బుక్స్ పరీక్షల విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరంలో అమల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
విద్యార్థులు కేవలం ఇంజనీరింగ్ పూర్తి చేశారన్నట్లు కాకుండా కాలేజీల్లో చేరిన విద్యార్థుల్లో ఎంత మందికి ప్లేస్‌మెంట్స్ వస్తున్నాయన్న అంశంపై అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ప్రధానంగా దృష్టి సారించింది. దీనిలో ముఖ్యంగా ఇంజనీరింగ్ పరీక్షల్లో ప్రశ్నపత్రాల రూపకల్పన, మూల్యాంకనం విధానాల్లో సమూల మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది. విద్యార్థుల్లో ఆలోచన, తార్కిక శక్తిని పెంపొందించడంతోపాటు విశ్లేషణాత్మక పరీక్షలు రాసేలా ప్రశ్నపత్రాల రూపకల్పన ఉండాలని భావిస్తోంది. అందుకోసం ఓపెన్ బుక్స్ పరీక్షల విధానం అమల్లోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది. దీనిపై రాష్ట్రంలోని యూనివర్సిటీలు, ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకుల నుంచి అభిప్రాయాలు సేకరించేందుకు ఏఐసీటీఈ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.పి.పుణ్య రాష్ట్రానికి వచ్చారు. డిసెంబర్ 14న హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమావేశమై అదే అంశాన్ని వివరించారు. అందుకు అనుగుణంగా కాలేజీలు సిద్ధం కావాలని స్పష్టం చేశారు. ఇన్నాళ్లు కాలేజీల్లో సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించిన ఏఐసీటీఈ ఇకపై కాలేజీల్లో చేరుతున్న విద్యార్థులు, వారికి లభిస్తున్న ఉద్యోగ అవకాశాలు (క్యాంపస్ ప్లేస్‌మెంట్స్), అందుకు కాలేజీలు చేపడుతున్న చర్యలపైనే ప్రధాన దృష్టి సారించనున్నట్లు పుణ్య వెల్లడించారు. ఈ సందర్భంగా పలు కాలేజీలకు చెందిన ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ముందుగా ఐఐటీ, ఎన్‌ఐటీ, యూనివర్సిటీ కాలేజీల్లో ఈ విధానం అమలు చేయాలని సూచించారు. ఈ విధానం అమలు చేయాలంటే ఎక్కువ సంఖ్యలో ప్రొఫెసర్లు, ఇతర అధ్యాపకుల అవసరం ఉంటుందని తెలిపారు. అలాగే ఇండస్ట్రీలో 20 నుంచి 30 ఏళ్ల అనుభవం కలిగిన వారిని ప్రొఫెసర్లుగా నేరుగా నియమించుకునే అధికారం రాష్ట్ర యూనివర్సిటీలకు ఇవ్వాలని కోరారు.
Published date : 15 Dec 2018 01:45PM

Photo Stories