Skip to main content

ఇంజనీరింగ్‌లో 48,982 సీట్లే భర్తీ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా చేపట్టిన ఎంసెట్ చివరి దశ సీట్ల కేటాయింపును ప్రవేశాల కమిటీ జూలై 25న ప్రకటించింది.
ఇందులో ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఫార్మ్-డి కోర్సుల్లో కొత్తగా 2,781 మంది విద్యా ర్థులకు సీట్లు లభించగా, 7,168 మంది ఒక కాలేజీ నుంచి మరో కాలేజీకి తమ సీట్లను మార్చుకున్నారు. చివరి దశ కౌన్సెలింగ్ ముగిసేనాటికి 190 ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 66,058 సీట్లు అందుబాటులో ఉండగా, అందులో 48,982 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 17,076 సీట్లు ఖాళీగానే ఉండి పోయాయి. ఇక 117 కాలేజీల్లో బీఫార్మసీ(ఎంపీసీ స్ట్రీమ్)లో 3,224 సీట్లు అందుబాటులో ఉం డగా, 134 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. మరో 3,090 సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి. 51 కాలేజీల్లో ఫార్మ్-డీలో 500 సీట్లు అందుబా టులో ఉండగా, 54 సీట్లు మాత్రమే భర్తీ కాగా 446 సీట్లు ఖాళీగానే ఉండిపోయాయి. సీట్లు పొందిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని,జూలై 27లోగా ఫీజు చెల్లించాలని ప్రవేశాల కమిటీ సూచించింది. జాయినింగ్ రిపోర్టు డౌన్‌లోడ్ చేసుకొని కాలేజీల్లో జూలై 27లోగా చేరాలని పేర్కొంది. సీట్లు వద్దనుకునే వారు కూడా జూలై 27లోగానే ఆన్‌లైన్‌లో రద్దు చేసుకోవాలని చెప్పింది. రాష్ట్రంలోని 45 కాలేజీల్లో (12 యూనివర్సిటీ కాలేజీలు, 33 ప్రైవేటు కాలేజీలు) వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయని కమిటీ తెలిపింది. 5 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదని పేర్కొంది. మరో ఆరు కాలేజీల్లో సింగిల్ డిజిట్ మేర విద్యార్థులు చేరారని, 29 కాలేజీల్లో 50 మందిలోపు చేరారని, 55 కాలేజీల్లో వంద మందిలోపు విద్యార్థులు చేరారని తెలిపింది.
Published date : 26 Jul 2018 05:51PM

Photo Stories