Skip to main content

ఇంజనీరింగ్‌లో 14 వేల సీట్ల కోత!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ఈసారి 14 వేల సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) కోత విధించింది.
గతేడాదితో పోల్చితే ఈ విద్యా సంవత్సరం 33 కాలేజీలకు అనుమతులు తగ్గగా, వాటిల్లోని 14 వేల సీట్లకు కోత ఏఐసీటీఈ పెట్టింది. 2017-18 విద్యా సంవత్సరంలో వివిధ వృత్తి విద్య కాలేజీలకు ఏఐసీటీఈ తాజాగా అనుమతులు జారీ చేసింది. గతేడాదితో పోల్చితే బీ ఫార్మసీలో 2 వేలు, ఎంబీఏలో 5 వేలు, ఎంసీఏలో 1,500కు పైగా సీట్లకు కోత పడింది. ఎంటెక్‌లోనూ 7 వేల సీట్లకు అనుమతులి లభించలేదు. ఎంఫార్మసీలో వేయి, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో 5 వేల సీట్లకు కోత పడింది. అయితే త్వరలో మరిన్ని కాలేజీలు, సీట్లకు ఏఐసీటీఈ ఆమోదం లభి స్తుందని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఈ మేరకు ప్రయత్నాలు మొదలు పెట్టాయి. కాగా, ఈసారి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో సీట్ల సంఖ్య పెరిగింది. హుస్నాబాద్ కొత్త పాలిటెక్నిక్ కాలేజీలో ప్రవేశాలకు అనుమతి లభించింది. గతేడాది రాష్ట్రంలో 56 ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో 11,980 సీట్లు ఉండగా, ఈసారి 57 పాలిటెక్నిక్ కాలేజీల్లో 12,100 సీట్లకు అనుమతి వచ్చింది. ఇంజనీరింగ్‌లో 242 కాలేజీల్లోని 4,613 బ్రాంచీలకు అనుమతి లభించింది.

మరింతగా తగ్గనున్న ఇంజనీరింగ్ సీట్లు ...
రాష్ట్రంలో ఈసారి ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య భారీగా తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. గతేడాది రాష్ట్రంలోని 275 కాలేజీల్లో 1,38,168 సీట్లకు అనుమతినిచ్చిన ఏఐసీటీ ఈ.. ఈసారి 242 కాలేజీల్లోని 1,24,239 సీట్లకు మాత్రమే అనుమతిచ్చింది. మరో వైపు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో జవహార్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయం తనిఖీలు పూర్తి చేసింది. ప్రస్తుతం తనిఖీ నివేదికల పరిశీలన జరుపుతోంది. వాటిలో లోపాలున్న కాలేజీలకు అనుమతులిచ్చే అవకాశం లేదు. దీనికితోడు సీట్లు, బ్రాంచీల తగ్గింపునకు 81 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయి. మరో 11 కాలేజీలు పలు కోర్సులు, ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలను నిలిపేసేందకు (క్లోజర్) దరఖాస్తు చేసుకున్నాయి. ఆ ప్రకారం మరో 20 వేల సీట్లు తగ్గిపోయే అవకాశం ఉంది.

ఎంటెక్‌లోనూ భారీ కోత..
ఎంటెక్‌లో అనుమతులు పొందిన కాలేజీల సంఖ్య తగ్గడంతో ఈసారి 7 వేల వరకు సీట్లకు కోత పడింది. గతేడాది 264 ఇంజనీరింగ్ కాలేజీల్లో 32,086 ఎంటెక్ సీట్లకు ఏఐసీటీఈ అనుమతివ్వగా ఈసారి 203 ఇంజనీరింగ్ కాలేజీలకు, వాటిల్లో 25,140 సీట్లకే అనుమతులు మంజూరు చేసింది. కాగా, కాలేజీల్లో లోపాల కారణంగా జేఎన్‌టీయూహెచ్ మరిన్ని సీట్లకు కోత పెట్టే అవకాశముంది.

కోర్సుల వారీగా ఏఐసీటీఈ అనుమతిచ్చిన కాలేజీలు, సీట్ల వివరాలు..

2016-17

2017-18

కోర్సు

కాలేజీలు

సీట్లు

కాలేజీలు

సీట్లు

బీఈ/బీటెక్

275

1,38,168

242

1,24,239

బీఫార్మసీ

151

14,640

133

12,775

ఎంబీఏ

435

56,775

347

49,470

ఎంసీఏ

95

5,846

52

4,166

ఎంటెక్

264

32,086

203

25,140

ఎంఫార్మసీ

141

10,173

126

9,182

ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు

56

11,980

57

12,100

ప్రైవేట్ పాలిటెక్నిక్‌లు

163

44,580

152

39,407

Published date : 02 May 2017 02:18PM

Photo Stories