ఇంజనీరింగ్ విద్యార్థులకుచదువుతో పాటే ఉపాధి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ విద్యార్థులకు చదువుతో పాటు ఉపాధి అవకాశాల్ని కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
యువతకు ఉపాధి అవకాశాలు పెరగాలంటే పరిశ్రమలకు అవసరమైన కోర్సులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. వీటిని ఇంజనీరింగ్ పాఠ్యాంశాలకు జోడించాలని యోచిస్తోంది. ఈ మేరకు డిసెంబర్ 30న రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఇంజనీరింగ్ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ఏర్పాటైన సబ్ కమిటీలు హాజరయ్యాయి. మారుతున్న పరిస్థితులు, విస్తరిస్తున్న పరిశ్రమలకు అనుగుణంగా ఇంజనీరింగ్ పాఠ్యాంశంలో సంస్కరణలు చేయాలని, ఇందులో యూనివర్సిటీలు కీలకంగా మారాలని సభ్యులు సూచించారు. ఇంజనీరింగ్ విద్య, సాధారణ విద్యనభ్యసించే విద్యార్థులకు మెరుగైన ఉపాధి మార్గాలను చూపడానికి, నిరుద్యోగాన్ని భారీగా తగ్గించడం కోసం సబ్ కమిటీలు పనిచేయనున్నాయి. అలాగే పాఠ్యాంశం, ఇంటర్న్‌షిప్ అండ్ ఎంప్లాయిమెంట్, యూనివర్సిటీల్లో ఇంక్యుబేషన్ కేంద్రాల కోసం కమిటీలు కృషి చేస్తాయి. వర్సిటీల్లో కొత్తగా ఏర్పాటు చేయనున్న ఇంక్యుబేషన్ కేంద్రాల్లో విద్యార్థులు వివరాలు నమోదు చేసుకునేందుకు వీలుగా ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. పరిశ్రమల అవసరాలు ఏమిటనే అంశం ఆధారంగా విద్యార్థులు తమ ఆలోచనలను పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఓయూ వీసీ రామచంద్రమ్, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ సీతారామారావు, కేయూ వీసీ సాయన్న, జేఎన్‌టీయూఎఫ్ వీసీ కవితాదర్యాని, ఆర్జీయూకేటీ వీసీ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Published date : 01 Jan 2018 03:37PM