ఇంజనీరింగ్ తుది దశ కౌన్సెలింగ్ పూర్తయ్యాకే ఒరిజినల్స్ ఇవ్వండి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరే విద్యార్థులు తుది దశ కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లను కాలేజీల్లో ఇవ్వవద్దని ప్రవేశాల కమిటీ స్పష్టం చేసింది.
ముందుగానే ఒరిజినల్స్ ఇస్తే తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపింది. కాలేజీల్లో చెల్లించాల్సిన స్పెషల్ ఫీజును (రూ.5,500, ఎన్‌బీఏ అక్రెడిటేషన్ ఉన్న కాలేజీలకు రూ.8,550) కూడా తుది దశ కౌన్సెలింగ్ తర్వాత చెల్లించాలని సూచించింది. ఇంజనీరింగ్ ప్రవేశాల మొదటి దశ కౌన్సెలింగ్‌లో భాగంగా 56,046 మంది విద్యార్థులకు గత నెల 28న ఎంసెట్ ప్రవేశాల కమిటీ సీట్లను కేటాయించింది. సీట్లు పొందిన వారంతా ఈనెల 7వ తేదీ వరకు కాలేజీల్లో చేరే అవకాశాన్ని కల్పించింది. అయితే ప్రవేశాలకు సంబంధించి తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతున్న సందేహాలను నివృత్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. తల్లిదండ్రులు తరచూ ప్రవేశాల కమిటీని అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.
అందులోని ప్రధాన అంశాలివి..
అందులోని ప్రధాన అంశాలివి..
- సీటు లభించిన విద్యార్థులు వెబ్‌సైట్‌లో (https://treamcet.nic.in) ముందుగా అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. అనంతరం వెబ్‌సైట్‌లోనే కచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. తర్వాత వచ్చే అడ్మిషన్ నంబరు తీసుకోవాలి. అలాట్‌మెంట్ ఆర్డర్‌లో పేర్కొన్న ఫీజు (వర్తించే వారు, రీయింబర్స్‌మెంట్ రాని వారు) ఈనెల 7వ తేదీలోగా చెల్లించాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే ఆ సీటు రద్దు అవుతుంది. సీటు వచ్చిన కాలేజీల్లో చేరాలనుకునే వారు 7వ తేదీలోగా రిపోర్టు చేయాలి. ఈలోగా రిపోర్టు చేయకపోయినా ఆ సీటు రద్దు కాదు. ఒకవేళ రిపోర్టు చేసినా సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీలే ఇవ్వాలి. దీంతో తుది దశ కౌన్సెలింగ్‌లో మరో కాలేజీలో సీటు వచ్చినా వెళ్లిపోవచ్చు.
- కాలేజీలకు వెళ్లినపుడు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వొద్దు. ఫీజు చెల్లించిన చలానా కూడా ఒరిజినల్ కాకుండా కేవలం జిరాక్స్ కాపీలను మాత్రమే సబ్మిట్ చేయాలి. తుది దశ కౌన్సెలింగ్ తర్వాత ఆ కాలేజీలో చదవాలనుకుంటే ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వాలి.
- ముందుగా ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చేస్తే.. తుది దశ కౌన్సెలింగ్‌లో విద్యార్థి కోరుకున్న కాలేజీలో సీటు లభించినా అందులో చేరేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ముందుగానే సర్టిఫికెట్లు ఇవ్వడం వల్ల వెళ్లిపోతామంటే యాజమాన్యాలు సర్టిఫికెట్లు తిరిగి ఇచ్చే అవకాశాలు తక్కువ. కాబట్టి ఈ జాగ్రత్త తప్పనిసరి.
- మొదట సీటు లభించిన కాలేజీ కంటే మెరుగైన కాలేజీలు ఉన్నాయనుకుంటేనే, వాటిల్లో మాత్రమే చివరి దశ కౌనెన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చుకోవాలి. చివరి దశ కౌన్సెలింగ్‌లో ఏదో ఓ కాలేజీలో ఆప్షన్లు ఇవ్వడం ద్వారా, అందులో సీటు లభిస్తే.. మొదట లభించిన సీటు ఆటోమెటిగ్గా రద్దు అవుతుంది. కాబట్టి తుది దశ కౌన్సెలింగ్ సమయంలో అప్షన్లను జాగ్రత్తగా చూసుకుని ఇవ్వాలి.
- తుది దశ కౌన్సెలింగ్‌లో వెబ్ ఆప్షన్లు ఇచ్చినా సీటు రాకపోతే మొదటి దశ కౌన్సెలింగ్‌లో వచ్చిన సీటు అలాగే ఉంటుంది.
- తుది దశ కౌన్సెలింగ్‌కు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. ఆ సమయంలో ఫ్రెష్‌గా ఆప్షన్లు ఇచ్చుకోవాలి. మొదటి కౌన్సెలింగ్‌లో ఇచ్చిన ఆప్షన్లు పని చేయవు.
- విద్యార్థులు చెల్లించే ఫీజు కన్వీనర్ పేరుతోనే ఉంటుంది. తుది దశ కౌన్సెలింగ్‌లో మరో కాలేజీలో సీటు వస్తే ఆ ఫీజును ఆ కాలేజీకి ట్రాన్‌సఫర్ చేస్తారు. రెండో సారి సీటు వచ్చిన కాలేజీలో ఫీజు తక్కువ ఉంటే మిగిలిన మొత్తాన్ని విద్యార్థికి తిరిగి చెల్లిస్తారు.
- మొదటి, రెండో దశల్లో సీట్లు వచ్చి, ఫీజు చెల్లించిన వారు ఆ సీట్లు వద్దనుకుంటే రద్దు చేసుకోవచ్చు. చెల్లించిన ఫీజును తుది దశ కౌన్సెలింగ్ తర్వాత మూడు నాలుగు రోజులకు తిరిగి ఇచ్చేస్తారు. ఆ తేదీలను తర్వాత ప్రకటిస్తారు.
- తుది దశ కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిన కాలేజీలో ఏ బ్రాంచ్‌లో సీటు లభిస్తుందో అందులోనే చేరాలి. మరో బ్రాంచీకి మార్చుకుంటే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదు.
- కన్వీనర్ కోటాలో సీటు లభిస్తేనే.. అందులో ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించే వారికి మాత్రమే ఫీజు వస్తుంది. మేనేజ్‌మెంట్ కోటా, స్పాట్ అడ్మిషన్లలో చేరే వారికి ఫీజు రాదు.
- విద్యార్థులు మధ్యవర్తులను సంప్రదించవద్దు. తమ వివరాలను ఇతరులకు ఇవ్వవద్దు. పాస్‌వర్డ్ చెప్పవద్దు. నెట్ సెంటర్లలో లాగిన్ అయ్యాక వెళ్లిపోయేప్పుడు కచ్చితంగా లాగ్ అవుట్ చేయాలి.
Published date : 03 Jul 2017 03:39PM