Skip to main content

ఇంజనీరింగ్ స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో భర్తీ కాకుండా మిగిలిపోయిన 12,638 సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకునేందుకు వీలు కల్పిస్తూ సాంకేతిక విద్యా శాఖ స్పాట్ అడ్మిషన్ నోటిఫికేషన్‌ను మంగళవారం జారీ చేసింది.
కాలేజీలు, బ్రాంచీల వారీగా భర్తీ అయిన సీట్లు, ఖాళీల వివరాలను tseamcet.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు శాఖ వెల్లడించింది. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేని విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లలో సీట్లు ఇవ్వరని పేర్కొంది. ఇందులో సీట్లు పొందిన విద్యార్థులకు, కాలేజీలో ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా బ్రాంచీలు మార్పు చేసుకున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదని స్పష్టం చేసింది. ఈ నెల 6న విద్యార్థులు స్లైడింగ్ ద్వారా బ్రాంచీలను మార్పు చేసుకోవచ్చంది. కాలేజీలు, బ్రాంచీల వారీగా మిగిలిపోయిన సీట్ల వివరాలతో యాజమాన్యాలు ఈ నెల 8న స్పాట్ అడ్మిషన్లకు నోటిఫికేషన్లు జారీ చేయాలని, 13 లోగా ప్రవేశాలను పూర్తి చేయాలని సూచించింది. స్పాట్ అడ్మిషన్లలో ప్రవేశాలు పొందిన విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్ ద్వారా ఈ నెల 16 లోగా అప్‌లోడ్ చేయాలంది. హార్డ్ కాపీలు, డీడీలు, ఇతర సర్టిఫికెట్లను ఈ నెల 20 లోగా ప్రవేశాల కన్వీనర్‌కు యాజమాన్యాలు అందజేయాలని స్పష్టం చేసింది. ఎంసెట్‌లో అర్హత సాధించిన వారు రూ.1,000, అర్హత పొందనివారు రూ.1,500 ఫీజుగా చెల్లించాలి.

నిబంధనలివీ..: కాలేజీల్లో మిగిలిన సీట్లను ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా ముందుగా భర్తీ చేయాలి. ఆ తరువాత ఎంసెట్‌లో అర్హత సాధించిన వారితో భర్తీ చేయాలి. గ్రూపు సబ్జెక్టుల్లో 44.5 శాతానికి పైగా మార్కులు వచ్చిన వారితో భర్తీ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే 39.5 శాతానికి పైగా మార్కులు వచ్చిన వారితో... అప్పటికీ సీట్లు మిగిలిపోతే ఇంటర్మీడియెట్‌లో నిర్ణీత మార్కులతో ఉత్తీర్ణులైన వారితో భర్తీ చేయాలి. తల్లిదండ్రులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారై, విద్యార్థుల పూర్తిగా ఇతర రాష్ట్రాల్లోనే చదివుంటే నాన్‌లోకల్ కేటగిరీలోనూ తెలంగాణలో ప్రవేశాలు కల్పించరు. వారిని చేర్చుకుంటే ర్యాటిఫికేషన్ చేయరు.

అవసరమైన సర్టిఫికెట్లు...: ఒరిజినల్ టెన్త్ మార్కుల మెమో, ఇంటర్మీడియెట్ మార్కుల మెమో, స్టడీ సర్టిఫికెట్లు, ఎంసెట్ ర్యాంకు కార్డు (అర్హులైతే), కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), నివాస ధ్రువీకరణ పత్రం.
Published date : 03 Aug 2016 02:38PM

Photo Stories