Skip to main content

ఇంజనీరింగ్ సీట్లు... లక్ష తగ్గినా మరో లక్ష ఖాళీయే!

  • తెలంగాణ, ఏపీల్లో భారీగా మిగిలిపోనున్న ఇంజనీరింగ్ సీట్లు
  • సర్టిఫికెట్ల పరిశీలన లెక్కలతో తేలుతున్న వాస్తవాలు
  • శుక్రవారం నాటికి సర్టిఫికెట్లు తనిఖీ చేయించుకున్నది 99,432 మందే
  • నేటితో ముగియనున్న పరిశీలన ప్రక్రియ
  • తెలంగాణలో 30 వేలు, ఏపీలో 70 వేలకు పైగా సీట్లు మిగిలే అవకాశం
  • కన్వీనర్ కోటాలోనే 70 వేలకు పైగా సీట్ల మిగులు!
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో.. భారీగా సీట్లు మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. లోపాల కారణంగా అనుమతివ్వకపోవడంతో తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజీల్లోనే లక్షకుపైగా సీట్లకు కోత పడగా... ప్రస్తుత సర్టిఫికెట్ల పరిశీలన లెక్కలను బట్టి ఇరు రాష్ట్రాల్లో మరో లక్షకు పైగా సీట్లు ఖాళీగా మిగిలిపోనున్నాయి.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కలిపి అఫిలియేషన్లు లభించిన 465 ఇంజనీరింగ్ కాలేజీల్లో మొత్తంగా 2,49,694 సీట్లు ఉండగా... శుక్రవారం వరకు సర్టిఫికెట్లు తనిఖీ చేయించుకున్న విద్యార్థులు 99,432 మంది మాత్రమే. శనివారంతో ఈ తనిఖీ ప్రక్రియ ముగియనుంది. సర్టిఫికెట్ల పరిశీలనకు ఇప్పటివరకు రోజుకు సగటున 10 వేల మంది మాత్రమే హాజరయ్యారు. చివరి రోజైన శనివారం మరో 20 వేల మంది హాజరవుతారని అనుకున్నా... మొత్తంగా ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనవారి సంఖ్య లక్షా 20 వేలకు మించేలా లేదు. ఇక ఈ పరిశీలనకు హాజరుకాకుండా నేరుగా యాజమాన్య కోటా సీట్లలో చేరేవారు మరో 30 వేల మంది వరకు ఉంటారని అనుకున్నా.. కన్వీనర్, మేనేజ్‌మెంట్ కోటాల్లో కలిపి లక్ష సీట్ల మిగులు తప్పేలా లేదు. ఇందులో కన్వీనర్ కోటాలోనే రెండు రాష్ట్రాల్లో 70 వేల వరకు సీట్లు మిగిలిపోనున్నట్లు అధికారుల అంచనా.

కన్వీనర్ కోటాలో భారీగా మిగులు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో శుక్రవారం నాటికి 1,78,052 మందిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలవగా... వెరిఫికేషన్ చేయించుకున్న వారు 99,432 మంది మాత్రమే. రెండు రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో కలిపి కన్వీనర్ కోటాలోనే 1,74,786 సీట్లు అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికెట్లను తనిఖీ చేయించుకున్న వారంతా కన్వీనర్ కోటాలోనే చేరినా.. 50వేలకు పైగా సీట్లు మిగిలిపోనున్నాయి. అయితే ఇందులో మేనేజ్‌మెంట్ కోటాలో చేరే విద్యార్థులు ఉంటారు. ఆ లెక్కన ఈ సారి కన్వీనర్ కోటాలోనే 70 వేలకు పైగా సీట్లు మిగిలిపోయే పరిస్థితి ఉంది.

భారీగా తగ్గినా..
తెలంగాణలోని సగానికిపైగా ఇంజనీరింగ్ కాలేజీలకు అఫిలియేషన్లు లభించకపోయినా.. భారీగానే సీట్లు మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణలో మొత్తం 315 కళాశాలలు ఉండగా... వాటిల్లో అఫిలియేషన్లు పొందిన 148 కాలేజీల్లో 85,021 సీట్లున్నాయి. ఇందులో 59,515 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. ఇక శుక్రవారం వరకు తెలంగాణలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనవారు 39,767 మంది మాత్రమే.

శనివారం మరో 10 వేల మంది హాజరైనా ఈ సంఖ్య 50 వేలకు మించదు. దీంతో తెలంగాణలోని కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు భారీగానే మిగలనున్నాయి. సర్టిఫికెట్ల తనిఖీ చేయించుకున్న వారిలో కొంత మంది యాజమాన్య కోటాలో చేరితే కన్వీనర్ కోటా సీట్లు ఇంకా ఎక్కువ సంఖ్యలో మిగిలిపోయే పరిస్థితి నెలకొంది.

ఏపీలో భారీగా మిగులు..!
ఆంధ్రప్రదేశ్‌లోనైతే భారీ సంఖ్యలో ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోనున్నాయి. అఫిలియేషన్లు లభించిన 317 కళాశాలల్లో మొత్తంగా 1,64,673 సీట్లు ఉండగా.. ఇందులో కన్వీనర్ కోటాలో 1,15,271 సీట్లు ఉన్నాయి. మరి శుక్రవారం వరకు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన వారు 59,665 మంది మాత్రమే. దీంతోపాటు కొంత మంది యాజమాన్య కోటా సీట్లలో చేరినా.. దాదాపు 70 వేలకు పైగానే ఇంజనీరింగ్ సీట్లు మిగిలిపోయే అవకాశం కనిపిస్తోంది.

యాజమాన్య కోటా భర్తీ త్వరలో షురూ!
ఇంజనీరింగ్ యాజమాన్య కోటా సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతోంది. ఏపీ ఉన్నత విద్యా మండలి ఏర్పాటు చేసే ప్రత్యేక వెబ్‌పోర్టల్‌లో యాజమాన్యాలు తమ కళాశాలల్లోని సీట్ల వివరాలను ఈ నెల 26న అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ వెబ్ పోర్టల్ వివరాలను మండలి శనివారం ప్రకటించనుంది. విద్యార్థులు వచ్చే నెల 3వ తేదీలోగా ఆన్‌లైన్‌లో లేదా నేరుగా దరఖాస్తులు చేసుకోవచ్చు. అనంతరం 5వ తేదీన మెరిట్ జాబితాలను రూపొందిస్తారు. 7న ఎంపిక జాబితాలను రూపొందించి 9వ తేదీన కళాశాలల పరిశీలనకు పంపిస్తారు. ఎంపికైన విద్యార్థులకు 12వ తేదీన యాజమాన్యాలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయి. 15వ తేదీలోగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ప్రక్రియలో మిగిలిపోయిన సీట్లను యాజమాన్యాలు 30వ తేదీలోగా భర్తీ చేయాలి. మొత్తంగా కాలేజీల్లో చేరిన విద్యార్థుల జాబితాకు అక్టోబరు 5న ఏపీ ఉన్నత విద్యా మండలి నుంచి ఆమోదం పొందాలి.
Published date : 23 Aug 2014 11:39AM

Photo Stories