Skip to main content

ఇంజనీరింగ్ ఫీ'జులుం'

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ఫీజులను ఇష్టానుసారంగా పెంచేస్తున్న కళాశాల యాజమాన్యాలు..
విద్యార్థుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి. ఏఎఫ్‌ఆర్‌సీ (అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ) నిర్దేశించిన ఫీజులు కాకుండా కాలేజీ యాజమాన్యాలు ఖరారు చేసిన ఫీజులు తక్షణమే చెల్లించాలని వారిపై ఒత్తిడి పెంచుతున్నాయి. కటాఫ్ తేదీలను విధిస్తూ ఆ లోపు చెల్లించకుంటే అపరాధ రుసుములు చెల్లించాల్సి వస్తుందంటూ భయాందోళనకు గురి చేస్తున్నాయి. కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన వారిపైనా ఇదే తరహాలో ఒత్తిడి తీవ్రతరం చేయడంతో ఆయా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం లబ్ధిదారులకు ట్యూషన్ ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. అడ్మిషన్ సమయంలోనే ఆయా విద్యార్థులకు సీట్ల కేటాయింపు లేఖలోనే స్పష్టం చేస్తారు. కానీ కొన్ని కాలేజీలు ఈ నిబంధనలను పట్టించుకోకుండా ఫీజుల వసూళ్లకు పాల్పడుతున్నాయి.

 డెడ్ లైన్ ఐదో తారీఖు..
 విద్యా సంవత్సరం అర్ధ వార్షికం కావస్తుండటంతో కాలేజీలు ఫీజుల వసూళ్ల వేగాన్ని పెంచాయి. 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజులను పేర్కొంటూ విద్యార్థులకు సర్క్యులర్లు పంపుతున్నాయి. ఇందులో ట్యూషన్ ఫీజుతో పాటు అక్రిడిటేషన్, మిస్లీనియస్ ఫీజులను సైతం జోడిస్తూ.. ఆ మొత్తాన్ని చెల్లించాలని స్పష్టం చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా గండిపేట్ సమీపంలోని ఓ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు వేరువేరుగా సర్క్యులర్లు పంపింది. కేటగిరీ-ఏ, కేటగిరీ-బీ విద్యార్థులతో పాటు ఎన్‌ఆర్‌ఐ, ఎన్‌ఆర్‌ఐ స్పాన్సర్డ్ విద్యార్థులు ఎంతమేర ఫీజులు చెల్లించాలో స్పష్టం చేసింది. గతేడాది చెల్లించిన మొత్తాలు కాకుండా.. ప్రస్తుతం పెంచిన ఫీజులు అక్టోబర్ 5లోగా తప్పనిసరిగా చెల్లించాలని ఆదేశించింది. విద్యార్థులు తమ లాగిన్ ద్వారా ఆన్‌లైన్ పద్ధతిలో లేదా తమ బ్యాంకు ఖాతా ఉన్న శాఖ ద్వారా డీడీల రూపంలో సమర్పించాలని పేర్కొంది. కటాఫ్ తేదీ తర్వాత రోజుకు రూ.50 నుంచి రూ.100 వరకు అపరాధ రుసుము చెల్లించాల్సి వస్తుందని తెలిపింది.

 విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన..
 ఫీజుల చెల్లింపులపై కాలేజీ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తుండటంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి రూ.2 లక్షలు చెల్లించడం తమవల్ల కాదంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. టాప్ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులను ఒత్తిడి చేస్తుండటంతో చదువుపై ఏకాగ్రత పెట్టలేకపోతున్నట్లు వాపోతున్నారు. ఈ మేరకు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు సంక్షేమ శాఖలకు ఫిర్యాదు చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం కింద నిధులు తక్షణమే విడుదల చేయాలని కోరుతూ లేఖలు సమర్పిస్తున్నారు. వీటిపై స్పందిస్తున్న అధికారులు.. విద్యార్థులు వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని, కాలేజీ యాజమాన్యాలకు అష్యూరెన్‌‌స సర్టిఫికెట్లు ఇవ్వాలని యోచిస్తున్నట్లు చెబుతున్నారు. 
Published date : 03 Oct 2019 03:02PM

Photo Stories