ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల ఫీజులు ఖరారు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్, ఫార్మసీ వృత్తి విద్యాకోర్సుల ఫీజులను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఎట్టకేలకు శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది.
అన్ని కోర్సుల గరిష్ట ఫీజును 30 శాతం వరకు పెంచింది. ఇంజనీరింగ్ (యూజీ, పీజీ), ఫార్మసీ తదితర కోర్సుల ఫీజుల పెంపునకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలపడంతో ఉన్నత విద్యాశాఖ శుక్రవారం ఇందుకు సంబంధించిన జీఓలను విడుదల చేసింది. రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ మండలి (ఏఎఫ్‌ఆర్సీ) నిర్ధారించిన ఫీజులను ప్రభుత్వం యధాతథంగా ఖరారు చేసింది. ఇంజనీరింగ్‌లో బీటెక్ కోర్సులకు కనిష్ట ఫీజును రూ.35వేలుగా, గరిష్ట ఫీజును రూ.1.08 లక్షలుగా నిర్ణయించింది. ఎంటెక్ కనిష్ట ఫీజు రూ.57 వేలు కాగా గరిష్ట ఫీజును రూ.లక్షగా ఖరారు చేసింది. బీఫార్మసీ కనిష్ట ఫీజు రూ.35 వేలు కాగా గరిష్ట ఫీజు రూ.90 వేలు. డీఫార్మసీ కనిష్ట ఫీజు రూ.68 వేలు కాగా గరిష్ట ఫీజు రూ.1.25 లక్షలు. ఎంఫార్మసీకి కనిష్టంగా రూ.64 వేలు గరిష్టంగా రూ.1.60 లక్షల ఫీజును ఖరారు చేశారు. రాష్ట్రంలోని అన్ ఎయిడెడ్ ప్రైవేటు ఇంజనీరింగ్, తదితర వృత్తివిద్యా కాలేజీలన్నిటికీ ఈ ఫీజులు వర్తించనున్నాయి. 2016-17 నుంచి 2018-19 వరకు మూడేళ్ల పాటు ఈ ఫీజులు అమల్లో ఉంటాయని జీఓలో పేర్కొన్నారు. ఫీజుల జీఓలు రాని కారణంగా ఈ నెల 22న జరగాల్సిన ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపును ఎంసెట్ అడ్మిషన్ల కమిటీ వాయిదా వేయడం తెలిసిందే. తాజాగా కళాశాలల వారీగా ఖరారైన ఫీజుల వివరాలను, తదుపరి షెడ్యూల్‌ను ఎంసెట్ కౌన్సెలింగ్ వెబ్‌సైట్లో (apeamcet.nic.in) అధికారులు పొందుపరిచారు. గుంటూరు జిల్లాలోని ఆర్‌వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సంస్థ ఫీజును 1.08 లక్షలు చేశారు. గాయత్రీ విద్యాపరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు రూ.1,03,700, జీఎమ్మార్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి రూ.1.01లక్షలు, వీఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీకి రూ.1.02 లక్షల ఫీజు ఖరారు చేశారు. కళాశాలల ఫీజులను పరిశీలించుకుని విద్యార్థులు తమ ఆప్షన్లను మార్పు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటో ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులు ఈనెల 26వ తేదీ సాయంత్రం ఆరుగంటల వరకు తమ ఆప్షన్లను మార్పు చేసుకోవచ్చని తెలిపారు. సీట్ల కేటాయింపు ప్రక్రియ ఈనెల 27వ తేదీన ఉంటుంది. ఆరోజు సాయంత్రం 6గ ంటలనుంచి సీట్ల కేటాయింపు వివరాలు వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయనున్నారు. విద్యార్థులు జూన్ 29వ తేదీనుంచి కాలేజీల్లో రిపోర్టు చేయాలి. జూలై 1వ తేదీనుంచి తరగతులు ప్రారంభమవుతాయని మంత్రి వివరించారు.
10 వేలలోపు ర్యాంకర్లకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ :
పదివేల లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రుల వార్షికాదాయం, నిబంధనలను అనుసరించి పూర్తి ఫీజును రీయింబర్స్ చేస్తారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులకు ర్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఫీజు భరిస్తుంది. తక్కిన విద్యార్థులకు వారి ఆదాయ పరిమితిని అనుసరించి కనిష్ట ఫీజును (రూ.35 వేలు) రీయింబర్స్ చేస్తారు.
10 వేలలోపు ర్యాంకర్లకే పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ :
పదివేల లోపు ర్యాంకులు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రుల వార్షికాదాయం, నిబంధనలను అనుసరించి పూర్తి ఫీజును రీయింబర్స్ చేస్తారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో చదువుకున్న విద్యార్థులకు ర్యాంకులతో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఫీజు భరిస్తుంది. తక్కిన విద్యార్థులకు వారి ఆదాయ పరిమితిని అనుసరించి కనిష్ట ఫీజును (రూ.35 వేలు) రీయింబర్స్ చేస్తారు.
Published date : 25 Jun 2016 02:51PM