Skip to main content

ఇంజనీరింగ్ ప్రవేశాల్లో జాప్యం

హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు మరికొన్ని రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఈనెల 10 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు షెడ్యూలు సిద్ధం చేసినా దానిని అమలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రవేశాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడకపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడితే, వెంటనే కౌన్సెలింగ్ నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు ఉమ్మడి ప్రవేశాల కమిటీ శుక్రవారం సాయంత్రం ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో సమావేశమైంది. అయితే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడకపోవడంతో నోటిఫికేషన్ జారీ నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. ఒకవేళ ప్రభుత్వం నుంచి శనివారం ఉత్తర్వులు వెలువడితే 12 లేదా 13వ తేదీల్లో ప్రవేశాలు ప్రారంభించేందుకు వీలు కలుగుతుంది. సోమవారం తరువాత జీఓలు జారీ అయితే ఈనెల 14వ తేదీ నుంచి 17వ తేదీల మధ్యలో ప్రవేశాల కౌన్సెలింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది.

సుప్రీంకోర్టుకు అభ్యర్థన..
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌లో ప్రవేశాలు కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, తరగతుల ప్రారంభం విషయంలో తమకు మరికొంత గడువు ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టును అభ్యర్థించాలని ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. సుప్రీంకోర్టు, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) ఆదేశాల ప్రకారం సాంకేతిక విద్యా కోర్సుల్లో ఈనెల 15నాటికి మొదటి దశ ప్రవేశాలు పూర్తి కావాలి. 22వ తేదీలోగా రెండో దశ ప్రవేశాలు పూర్తి కావాలి. 29వ తేదీలోగా చివరి దశ ప్రవేశాలు పూర్తి కావాలి. ఆగస్టు 1 నుంచి తరగతులు ప్రారంభం కావాలి.
Published date : 05 Jul 2014 12:04PM

Photo Stories