ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లోనే ఐటీఐలు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లను ఏర్పాటు చేసేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఆమోదం తెలిపింది. 2016లో తీసుకున్న నిర్ణయాన్ని తాజాగా అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది.
మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషన్ ట్రైనింగ్ సూచనల మేరకు 2019-20 విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీల్లో ఐటీఐలను ప్రారంభించేందుకు యాజమాన్యాలు దరఖాస్తు చేసుకునేలా వీలు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రత్యేకంగా పెద్ద ఎత్తున సదుపాయాలు కల్పించాల్సిన అవసరం లేకుండా ఉన్న సదుపాయాలతోపాటు కొద్దిపాటి వసతులు కల్పిస్తూ ఐటీఐలను ఏర్పాటు చేసుకోవచ్చని వెల్లడించింది. ఈ మేరకు ఏఐసీటీఈ ఆమోదం పొందిన ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కాలేజీలకు, అన్ని రాష్ట్రాల సాంకేతిక విద్యాశాఖలకు లేఖలు రాసింది.
Published date : 02 Jan 2019 12:58PM