Skip to main content

ఇంజనీరింగ్ కోర్సుల కరిక్యులమ్‌లో సమూల మార్పులు

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ కోర్సుల విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకురావాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది.
ఇందులో భాగంగా మోడల్ కరిక్యులమ్‌ను సిద్ధం చేస్తోంది. త్వరలోనే దీన్ని ఖరారు చేయనుంది. ప్రాజెక్టు కార్యకలాపాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా సిలబస్‌లో సమూల మార్పులు తీసుకురాబోతోంది. థియరీ విభాగాన్ని తగ్గించి ప్రాజెక్టులు, ప్రాక్టికల్స్‌ను ఎక్కువగా ప్రవేశ పెట్టడం ద్వారా విద్యార్థులపైనా ఒత్తిడిని తగ్గించవచ్చని యోచిస్తోంది. విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని భావిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 7 వేల ఇంజనీరింగ్ కాలేజీల్లో ఏటా 15 లక్షల మందికి పైగా విద్యార్థులు చదువుతున్నా ఉద్యోగ అవకాశాలు మాత్రం 40 శాతానికి మించడం లేదు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్‌తోపాటు సబ్జెక్టు పరమైన జ్ఞానం పెద్దగా లేకపోవడమే ఇందుకు కారణంగా ఏఐసీటీఈ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చేలా కొత్త సిలబస్‌ను తీసుకువచ్చేందకు చర్యలు చేపట్టింది. అలాగే ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరే విద్యార్థులకు ఇండక్షన్ ట్రైనింగ్‌ను ప్రవేశ పెట్టేందుకు చర్యలు చేపట్టింది.

వచ్చే విద్యా సంవత్సరం నుంచి..
దేశవ్యాప్తంగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి కరిక్యులమ్‌లో మార్పులను పక్కాగా అమలు చేసేందుకు ఏఐసీటీఈ కసరత్తు చేస్తోంది. థియరీ పరీక్షల్లోనూ క్రెడిట్స్‌ను (మార్కులకు పాయింట్లు) తగ్గించి, ప్రాజెక్టులకే క్రెడిట్స్‌ను పెంచేలా కొత్త కరిక్యులమ్‌ను సిద్ధం చేస్తోంది. ఇది ట్రైనింగ్ ఓరియెంటెడ్‌గా, డిజైన్ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. ఈ మేరకు సమగ్ర వివరాలను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు ఏఐసీటీఈ ఏర్పాట్లు చేస్తోంది. విశ్లేషణ సామర్థ్యాలు పెంపు, ల్యాబ్‌లలో శిక్షణ, ప్రాక్టికల్స్, డిజైన్, డెవలప్‌మెంట్ యాక్టివిటీస్ ప్రధానంగా కొత్త కరిక్యులమ్‌ను ప్రస్తుతం వివిధ సబ్జెక్టుల్లో 12 కమిటీలు రూపొందిస్తున్నాయి.

రాష్ట్రాలకు 20 శాతం వెసులుబాటు...
జాతీయ స్థాయిలో ఒకేలా సిలబస్ ఉండేలా ఏఐసీటీఈ చర్యలు చేపట్టినా, రాష్ట్రాలకు 20% వెసులుబాటు కల్పించేందుకు ఆలోచనలు చేస్తోంది. రాష్ట్రాల్లో పరిస్థితులు, స్థానిక అవసరాలకు అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు చేసుకునే వీలు కల్పించేలా చర్యలు చేపడుతోంది. కొన్ని రాష్ట్రాల్లో అగ్రికల్చర్‌కు సంబంధించిన అంశాల్లో ప్రాధాన్యం ఉండగా, కొన్ని రాష్ట్రాల్లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఇంకొన్ని రాష్ట్రాల్లో టెక్స్‌టైల్ టెక్నాలజీకి ప్రాధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు ఆయా రంగాలకు సంబంధించిన సిలబస్‌లో 20 శాతం వరకు మార్పులు చేసుకునే వీలు కల్పించాలని నిర్ణయించింది.
Published date : 31 Jul 2017 02:20PM

Photo Stories