ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలోనే భారీగా మిగులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ ప్రవేశాల్లో భాగంగా ఈసారి కన్వీనర్ కోటాలోనే 23,546 సీట్లకుపైగా మిగిలిపోయే పరిస్థితి నెలకొంది. మొత్తంగా కన్వీనర్ కోటాలో 86,103 సీట్లు ఉండగా.. 62,457 మంది విద్యార్థులు మాత్రమే వెబ్‌ఆప్షన్లకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.
అందులో 61,662 మంది మొదటి దశలో ఆప్షన్లు ఇచ్చుకున్నారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారంతా రెండో దశలో ఆప్షన్లు ఇచ్చుకున్నా ఈసారి కన్వీనర్ కోటాలోనే 23,546 సీట్లు మిగిలిపోనున్నాయి. అసలు ఈసారి అందుబాటులో ఉండనున్న మొత్తం సీట్లు 1,34,783కాగా.. కన్వీనర్ కోటాలో 86,103 సీట్లు, యాజమాన్య కోటాలో 39,499 సీట్లు అందుబాటులోనున్నాయి. ఇక మైనారిటీ కాలేజీల్లోని 2,110 సీట్లను వాటి యాజమాన్యాలే కన్సార్షియంగా ఏర్పడి భర్తీ చేసుకుంటాయని, సొంత పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టే ఎస్‌డబ్ల్యూ-3లో 3,304 సీట్లు అందుబాటులో ఉంటాయని ఎంసెట్ ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ పేర్కొన్నారు. మొదటి దశ ప్రవేశాల్లో భాగంగా ఈనెల 17 నుంచి చేపట్టిన వెబ్ ఆప్షన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. 22 రాత్రి వరకు ఆప్షన్లలో మార్పులతో పాటు కొత్త ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 24న సీట్లను కేటాయిస్తారు.
వెబ్‌ఆప్షన్ల వివరాలు..
వెబ్‌ఆప్షన్ల వివరాలు..
- సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్న వారు 66,362 మంది
- ఆప్షన్లకు పాస్‌వర్డ్ జనరేట్ చేసుకున్నవారు 62,457
- మొదటి దశలో ఆప్షన్లు ఇచ్చినవారు 61,133
- పాస్‌వర్డ్ జనరేట్ చేసుకున్నా ఆప్షన్లు ఇవ్వని వారు 1,324
- మొత్తం విద్యార్థులు ఇచ్చిన ఆప్షన్లు 22,91,583
- ఒక విద్యార్థి అత్యధికంగా ఇచ్చిన ఆప్షన్లు 594
Published date : 22 Jul 2015 02:54PM