ఇంజనీరింగ్ క్లాసులు జూలై 1 నుంచి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంజనీరింగ్ తరగతులను ఈసారి జూలై 1 నుంచి కచ్చితంగా ప్రారంభించేందుకు ఉన్నత విద్యా మండలి చర్యలు చేపట్టింది.
ఇంజనీరింగ్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చే ప్రక్రియను మే 15కల్లా పూర్తి చేయాలని హైదరాబాద్ జేఎన్‌టీయూతోపాటు ఉస్మానియా, కాకతీయ, ఇతర యూనివర్సిటీలకు సూచించింది. గత మూడేళ్లుగా రాష్ట్రంలో ఇంజనీరింగ్ ప్రవేశాలు వివిధ కారణాలతో ఆలస్యమవుతున్న నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో జూన్ నెలాఖరుకల్లా ప్రవేశాలను పూర్తి చేసి జూలై 1 నుంచి తరగతులను ప్రారంభించాలని ఉన్నత విద్యా మండలి పట్టుదలతో ఉంది. ఉన్నత విద్యా మండలి సూచనల మేరకు ఆయా యూనివర్సిటీలు తమ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీల అనుబంధ గుర్తింపు ప్రక్రియను వేగవంతం చే శాయి. కాలేజీల్లో లోపాలపై నోటీసులు జారీ చేయడంతోపాటు అవసరమైన వివరాలను యాజమాన్యాల నుంచి సేకరిస్తున్నాయి. మరోవైపు వచ్చే మూడేళ్లపాటు వసూలు చేసే ఫీజులను ఖరారు చేసేందుకు తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) చర్యలు చేపట్టింది. కాగా, ఏటా వివిధ కారణాలతో ప్రవేశాలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో లోపాలపై కాలేజీలకు ముందే నోటీసులు జారీ చేసేలా విద్యా మండలి చర్యలు చేపట్టింది. తద్వారా కాలేజీలు లోపాలు సరిదిద్దుకునే అవకాశం ఇచ్చేలా వర్సిటీలకు సూచించింది. అలాగే జూలై 1న తరగతులు ప్రారంభమయ్యాక 10వ తేదీ వరకు స్లైడింగ్‌కు అవకాశం ఇచ్చేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తోంది.
Published date : 05 Apr 2016 02:25PM