ఇంజనీరింగ్ కౌన్సెలింగ్... 17 నుంచి వెబ్ ఆప్షన్లు
Sakshi Education
- 26, 27 తేదీల్లో తుది మార్పులకు అవకాశం
- 30న సీట్ల కేటాయింపు, 1 నుంచి తరగతులు
- షెడ్యూల్ ప్రకటన..
- ఇక ఉమ్మడిగాఎంసెట్ ప్రవేశాలు
తెలంగాణలో 315.. ఏపీలో 350 కాలేజీలు:
తెలంగాణలో 315 ఇంజనీరింగ్ కాలేజీలకు, ఆంధ్రప్రదేశ్‌లో 350 కాలేజీలకు ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. వాటికి సంబంధించిన అఫిలియేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని ఈనెల 15వ తేదీ నాటికి ఇది పూర్తవుతుందని పేర్కొన్నారు. ఆ వెంటనే విద్యార్థులకు ఆప్షన్లు ఇచ్చుకునేందుకు వీలుగా ఆయా కాలేజీలు, వాటిలోని సీట్ల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఇక మైనారిటీ కాలేజీలు, సొంత ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు చేపట్టే కాలేజీలకు సంబంధించిన వివరాలు తమకు ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) నుంచి రావాల్సి ఉందన్నారు. ఈ నెల 15 లేదా 20వ తేదీ నాటికి వీటిపై స్పష్టత వస్తుందన్నారు. మరోవైపు ఇప్పటివరకు పూర్తయిన 8 ప్రవేశ పరీక్షలకు సంబంధించి ఉమ్మడి ప్రవేశాలు చేపట్టాల్సి ఉంది. వీటిలో నాలుగింటి చొప్పున పరీక్షలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సాంకేతిక విద్యా కమిషనర్లు కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు. ఒకరు కన్వీనర్‌గా ఉంటే.. మరో రాష్ర్ట అధికారి కోకన్వీనర్‌గా ఉంటారు. మరో నాలుగు రోజుల్లో ఐసెట్, ఈసెట్ ప్రవేశాలకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు.
వెబ్ ఆప్షన్ల షెడ్యూల్
తేదీ | ర్యాంకు |
ఆగస్టు 17,18 | 1 నుంచి 50,000 |
20, 21 | 50,001 నుంచి 1,00,000 |
22, 23 | 1,00,001 నుంచి 1,50,000 |
24, 25 | 1,50,001 నుంచి చివరి ర్యాంకు(2,03,000) |
26 | 1 నుంచి 1,00,000 ర్యాంకు వరకు వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం |
27 | 1,00,001 నుంచి చివరి ర్యాంకు వరకు వెబ్ ఆప్షన్ల మార్పునకు అవకాశం |
30 | సీట్ల కేటాయింపు |
సెప్టెంబరు 1 | కాలేజీల్లో రిపోర్టు, తరగతులు ప్రారంభం |
వెబ్ ఆప్షన్లకు వన్‌టైమ్ పాస్‌వర్డ్
వెబ్ ఆప్షన్ల నమోదుకు వీలుగా ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా వన్‌టైమ్ పాస్‌వర్డ్ ఇవ్వనున్నారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో విద్యార్థి మొబైల్ నంబర్ తీసుకుంటారు. ఆప్షన్లు ఇచ్చే సమయంలో విద్యార్థి లాగిన్ కాగానే అతని మొబైల్‌కు పాస్‌వర్డ్ మెసేజ్ వస్తుంది. దాని ఆధారంగా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఆ పాస్‌వర్డ్ 15 నిమిషాలపాటు పని చేస్తుంది. ఆ సమయంలోగా ఇచ్చుకున్న ఆప్షన్లు వెంటనే సేవ్ అవుతాయి. నిర్ణీత సమయం పూర్తికాగానే ఆ వెబ్‌సైట్ నుంచి లాగ్ అవుట్ మెసేజ్ వస్తుంది. విద్యార్థి మళ్లీ లాగిన్ అయితే మరో పాస్‌వర్డ్ మొబైల్‌కి వస్తుంది. దాని ఆధారంగా ఆప్షన్ల పేజీలోకి వెళ్లి మరిన్ని ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ఈ విధానంతో ఇంటర్నెట్ సెంటర్ల నిర్వాహకులు, దళారులు మోసాలు తగ్గించవచ్చని అధికారులు చెబుతున్నారు. విద్యార్థికి ఎలాంటి అనుమానం కలిగినా మరో పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి మళ్లీ మార్పులు చేసుకోవచ్చు. అలాగే 26, 27 తేదీల్లో మరోసారి ఆప్షన్లను సరిచూసుకోవాలి. అవసరమైతే తుది మార్పులు చేసుకుని సబ్‌మిట్ చేయాల్సి ఉంటుందని అధికారులు వివరించారు.
Published date : 13 Aug 2014 11:28AM