ఇంజనీరింగ్ కాలేజీల్లో రోబోటిక్ సెంటర్
Sakshi Education
సాక్షి, అమరావతి: రోబొటిక్, మెకట్రానిక్స్ విభాగాల్లో ఇంజనీరింగ్ విద్యార్థులకు అత్యుత్తమ శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా ఏపీఎస్‌ఎస్‌డీసీ- జర్మనీకి చెందిన యూరోపియన్ సెంటర్ ఫర్ మెకట్రానిక్స్‌తో (ఈసీఎం) ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) చైర్మన్ చల్లా మధుసూదన్ రెడ్డి తెలిపారు.
దేశంలోనే తొలిసారిగా రోబోటిక్ విభాగంలో జర్మన్ సంస్థతో కలిసి ఏపీలో శిక్షణ ఇవ్వడం జరుగుతోందన్నారు. విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో అక్టోబర్ 17న ఏపీఎస్‌ఎస్‌డీసీ- ఈసీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండో విడత 20 ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్వాన్స్డ్ రోబోటిక్ కంట్రోల్ ల్యాబ్‌లను ఆన్‌లైన్ ద్వారా చైర్మన్ చల్లా ప్రారంభించారు. చల్లా మాట్లాడుతూ ఒప్పందం ప్రకారం మొదటి విడతలో భాగంగా ఇప్పటికే 11 ఇంజరినీరింగ్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ రోబోటిక్స్ ల్యాబ్స్ కేంద్రాల్లో 788 మంది విద్యార్థులు ఏఆర్సీ 1.0లో శిక్షణ పూర్తి చేసుకున్నారని చెప్పారు. రెండో విడత 20 ఇంజనీరింగ్ కాలేజీల్లో ల్యాబ్‌లను ఏర్పాటు చేసి 800 మందికి శిక్షణనివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇండస్ట్రీ 4.0కు ఆనుగుణంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ఉద్యోగాలకు అదనపు నైపుణ్యాలు అవసరం ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ, సీఈవో డాక్టర్ అర్జా శ్రీకాంత్ మాట్లాడుతూ కేవలం డిగ్రీతో ఉద్యోగం రాదని, అదనపు నైపుణ్యాలు అవసరమన్నారు. అందువల్లే టెక్నికల్, నాన్ టెక్నికల్ విద్యార్థులకు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఆధ్వర్యంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న సర్టిఫికేషన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామన్నారు. రోబొటిక్స్, ఆటోమేషన్‌ల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయన్నారు. శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను చల్లా అందజేశారు. స్టూడెంట్ లీడర్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
Published date : 18 Oct 2019 05:25PM