Skip to main content

ఇంజనీరింగ్ కాలేజీల్లో ఆకస్మిక తనిఖీలు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో ఇకపై ఏడాదిలో ఎప్పుడైనా జేఎన్‌టీయూహెచ్ బృందాలు ఆకస్మిక తనిఖీలు చేపట్టనుంది.
కాలేజీలకు యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలో నాణ్యత ప్రమాణాలు, నిబంధనల మేరకు ఫ్యాకల్టీ, సదుపాయాలు ఉన్నాయా.. లేదా అన్న అంశాలపై ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలు (ఎఫ్‌ఎఫ్‌సీ) తనిఖీలు నిర్వహించి వాటి ఆధారంగా కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేది. కానీ ఇకపై అనుబంధ గుర్తింపు ఇచ్చే సమయంలోనే కాకుండా ఏడాది మొత్తంలో ఎప్పుడైనా తనిఖీలు చేపట్టనుంది. అంతేకాదు తనిఖీల సమయంలో టైం టేబుల్ ప్రకారం తరగతులు నిర్వహించకుండా దొరికినా.. నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ లేకపోయినా.. అనధికారికంగా సెలవులు ఇచ్చినా, ప్రిన్సిపాల్ అనుమతి లేకుండా సెలవులు ఉన్నా కాలేజీ అనుబంధ గుర్తింపును రద్దు చేస్తామని స్పష్టం చేసింది. జేఎన్‌టీయూ తమ పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల అనుబంధ గుర్తింపు నిబంధనలను జనవరి 11నజారీ చేసింది. అందులో అనుబంధ గుర్తింపు పొందాలనుకునే కాలేజీలు అనుసరించాల్సిన నిబంధనలను పొందుపరిచింది.

త్వరలో ‘అనుబంధం’నోటిఫికేషన్
ఇంజనీరింగ్ కాలేజీల్లో అధ్యాపకులు, విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేయకపోయినా, ల్యాబ్‌లలో తగిన సదుపాయాలు కల్పించకపోయినా అనుబంధ గుర్తింపును రద్దు చేస్తామని జేఎన్‌టీయూ స్పష్టం చేసింది. అఖిల భారత సాంకేతిక విదాయ మండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారమే అధ్యాపక విద్యార్థి నిష్పత్తి ఉంటుందని వెల్లడించింది. అనుబంధ గుర్తింపు కోసం కాలేజీల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరించేందుకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామని జేఎన్‌టీయూ వర్గాలు వెల్లడించాయి. వరుసగా మూడేళ్ల పాటు 25 శాతంలోపు సీట్లు భర్తీ కానీ బ్రాంచీల మూసివేత అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదు. అద్దె భవనాల్లో కాలేజీలు నిర్వహించడానికి వీల్లేదని పేర్కొంది. ప్రతి 300 మంది విద్యార్థులకు అదనపు ల్యాబ్ సదుపాయం కల్పించాలని స్పష్టం చేసింది. కాలేజీల మూసివేతకు జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కోర్సులు, కాలేజీలు మూసివేసేందుకు ఎన్‌వోసీ పొందేందుకు యాజమాన్యాలు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాలేజీలు తమ కాలేజీల్లో ప్రథమ సంవత్సరం నుంచి చివరి సంవత్సరం వరకు కోర్సుల వారీ వివరాలను జనవరి 20లోగా అందజేయాలని తెలిపింది. అటానమస్ కాలేజీలు అమలు చేస్తున్న సిలబస్ వివరాలను కూడా ఇవ్వాలని పేర్కొంది.

అధ్యాపకుల వివరాలివ్వాలి
కాలేజీల్లో పని చేస్తున్న అధ్యాపకుల వివరాలుజనవరి17 లోగా అనుబంధ గుర్తింపు దరఖాస్తుల పోర్టల్‌కు అప్‌లోడ్ చేయాలని సూచించింది. కాలేజీల్లో పని చేసే ఫ్యాకల్టీ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్ రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొంది. వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను అప్ లోడ్ చేయాలని, వారి పాన్, ఆధార్ నంబర్లను ఫ్యాకల్టీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను అఫీలియేషన్ దరఖాస్తు సమయంలో అందజేయాలని వివరించింది. కాలేజీలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినపుడు అప్‌లోడ్ చేసిన డేటాకు, ఎఫ్‌ఎఫ్‌సీలు చేసే వెరిఫికేషన్‌లో వెల్లడయ్యే డేటా మధ్య అధిక వ్యత్యాసం ఉంటే ఆ కాలేజీ చేసిన అనుబంధ గుర్తింపు దరఖాస్తునే తిరస్కరించనుంది.
Published date : 12 Jan 2019 03:47PM

Photo Stories