Skip to main content

ఇంజనీరింగ్ కాలేజీల రెన్యువల్స్ అధికారం వర్సిటీలకే... షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: ఇంజనీరింగ్ కళాశాలల అఫిలియేషన్ల రెన్యువల్స్‌కు ఉన్నత విద్యా మండలి షెడ్యూలును ప్రకటించింది. కళాశాలల అనుమతుల్లో కౌన్సిల్‌కు అధికారం ఉండేలా చేసిన ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. కొత్త కళాశాలలు, కోర్సులు, సీట్లు, పాత కాలేజీల అఫిలియేషన్ల రెన్యువల్స్ అధికారం వర్సిటీలదేనని స్పష్టం చేసింది. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. మండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి, వైస్‌చైర్మన్ విజయ ప్రకాష్, కార్యదర్శి ప్రొఫెసర్ సతీష్‌రెడ్డి, సాంకేతిక విద్య కమిషనర్ అజయ్‌జైన్, వివిధ యూనివర్సిటీల వైస్ చాన్సలర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. సాంకేతిక విద్యా కళాశాలలపై నియంత్రణ అధికారం అఖిల భారత సాంకేతిక విద్యా మండలికి (ఏఐసీటీఈ) లేదని, అది కేవలం అడ్వయిజరీ బాడీ మాత్రమేనని సుప్రీంకోర్టు మూడు నెలల కిందట పేర్కొన్న సంగతి తెలిసిందే. దీంతో ఇన్నాళ్లూ ఏఐసీటీఈ నిర్వర్తించిన బాధ్యతలను యూనివర్సిటీలకే అప్పగిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) మార్గదర్శకాలను జారీ చేసింది. కొత్త కాలేజీలు, అదనపు సీట్లు, కోర్సుల మంజూరు అధికారాలను వర్సిటీలకే ఉంటాయని వాటిల్లో పేర్కొంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఏఐసీటీఈని ప్రత్యేక చట్టం ద్వారా మళ్లీ అమల్లోకి తెచ్చే ఆలోచనలు చేస్తున్న నేపథ్యంలో కొత్త కోర్సులు, కొత్త కాలేజీలకు అనుమతులు, అదనపు సీట్ల మంజూరును మరో ఏడాది పాటు చేపట్టవద్దని యూజీసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేవలం యూనివర్సిటీల రెన్యువల్స్, సీట్ల కోత, కళాశాలల మూసివేత వంటి బాధ్యతలు అన్నింటినీ వర్సిటీలే చూడాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. జులై 15నాటికే సాంకేతిక విద్య కాలేజీల్లో ప్రవేశాలను పూర్తిచేసి, ఆగస్టు ఒకటి నుంచి తరగతులను ప్రారంభించాలని నిర్ణయించారు. అలాగే కళాశాల ప్రాంతం మార్పు, మూసివేత, మహిళా కళాశాలలను కో- ఎడ్యుకేషన్ కళాశాలలుగా మార్పు, సూపర్‌న్యూమరీ, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లు కొనసాగింపు/తగ్గింపు, కళాశాలల పేరు మార్పునకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఈ విద్యా సంవత్సరానికి సమయం లేనందున, 2015-16లో కొత్త కాలేజీలకు అనుమతులు, అఫిలియేషన్స్ కొనసాగింపుపై ప్రభుత్వమే విధానపర నిర్ణయాలు తీసుకుంటాయని నిర్ణయించారు.

రెన్యువల్స్, సీట్ల కోత, కోర్సుల మూసివేత షెడ్యూలు..

-ఈనెల 15లోగా నోటిఫికేషన్ల జారీ
-దరఖాస్తులకు చివరి గడువు ఏప్రిల్ 30
-ఇన్‌స్పెక్షన్ కమిటీ ఏర్పాటుకు చివరి తేదీ ఏప్రిల్ 30
- మే మొదటి వారంలోగా కాలేజీల తనిఖీలకు చివరి గడువు
- మే 31లోగా తనిఖీలు పూర్తి, సాంకేతిక విద్యాశాఖకు నివేదికలు
-జూన్ 9 లోగా ఉత్తర్వులు జారీ. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కు కళాశాల వారీగా సీట్లు ఖరారు
- జులై 15కు ప్రవేశాలు పూర్తి.. ఆగస్టు 1 నుంచి తరగతులు.
Published date : 12 Apr 2014 12:23PM

Photo Stories