Skip to main content

ఇక పీజీ కాలేజీల వంతు! లోపాలను సరిదిద్దుకునేందుకు రెండు రోజులు గడువు...

హైదరాబాద్: రాష్ట్రంలో నిబంధనలను ఉల్లంఘిస్తూ, పుట్టెడు లోపాలతో కొనసాగుతున్న ప్రైవేటు పీజీ కళాశాలలపై వేటు వేసేందుకు జేఎన్టీయూహెచ్ సన్నద్ధమైంది. ఇప్పటికే బీటెక్ కోర్సులు నిర్వహిస్తున్న 174 ప్రైవేటు ఇంజనీరింగ్ క ళాశాలలకు అఫిలియేషన్ నిరాకరించి సంచలనం సృష్టించిన వర్సిటీ అధికారులు.. తాజాగా ఇంజనీరింగ్, ఫార్మసీల్లో పీజీ స్థాయి కోర్సులు నిర్వహిస్తున్న కళాశాలలపై దృష్టిపెట్టారు. ఈ నెల 6నుంచి పీజీఈసెట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకుకు ఉన్నత విద్యా మండలి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వెబ్ కౌన్సెలింగ్‌లో పెట్టాల్సిన అఫిలియేటెడ్ కళాశాలల జాబితాపై జేఎన్టీయూహెచ్ కసరత్తు ప్రారంభించింది. మౌలిక వసతులు, లేబొరేటరీలు, బోధనా సిబ్బంది తదితర అంశాలపై ఇటీవలి తనిఖీల్లో గుర్తించిన లోపాలపై వివరణ కోరుతూ... 370 కళాశాలలకు బుధవారం నోటీసులు జారీచేసింది. ఎంటెక్ కోర్సులు నిర్వహిస్తున్న 250 ఇంజనీరింగ్ కళాశాలలు, 40 ఎంబీఏ, 20 ఎంసీఏ, 60 ఎంఫార్మసీ కళాశాలలు ఈ నోటీసులు అందుకున్న జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రాని కల్లా లోపాలను సరిదిద్దుకొని డెఫిషియెన్సీ కాంప్లెయిన్స్ రిపోర్టులను సమర్పించాలని వర్సిటీ ఆదేశించింది. లేనిపక్షంలో పీజీఈసెట్‌కు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎంసెట్ కౌన్సెలింగ్‌కు అఫిలియేషన్ రాని ప్రైవేటు కళాశాలలకు తాజాగా మరో దెబ్బ తగిలింది.
Published date : 04 Sep 2014 11:40AM

Photo Stories