Skip to main content

ఇక ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులు

సాక్షి, హైదరాబాద్: జేఎన్టీయూహెచ్ పరిధిలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.
అవసరమైన సదుపాయాలు, ఫ్యాకల్టీ ఉంటే 2020-21 విద్యా సంవత్సరంలో కొత్త కోర్సులు ప్రారంభించేందుకు కాలేజీలకు గుర్తింపు ఇవ్వాలని జేఎన్టీయూ హైదరాబాద్ నిర్ణయించింది. 2019-20 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ ప్రత్యేక అనుమతితో 5 కాలేజీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కోర్సును ప్రవేశ పెట్టగా, 2020-21 విద్యా సంవత్సరంలో సదుపాయాలు ఉన్న అన్ని కాలేజీలు ఆ కోర్సును ప్రారంభించేందుకు అనుమతులను ఇవ్వనుంది. ఏఐతో పాటు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (సీఎస్‌ఐటీ), కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ (సీఎస్‌బీఎస్), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ (ఐటీఈ) కోర్సులను ప్రవేశ పెట్టేందుకు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో 2020-21 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ కాలేజీలతో పాటు దాని అనుబంధ కాలేజీల్లో ఆయా కోర్సులు విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి.

ఎం.ఫార్మసీలో నాలుగు కొత్త కోర్సులు..
ఎం.ఫార్మసీలోనూ నాలుగు కొత్త కోర్సులకు అనుమతి ఇవ్వనుంది. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆయా కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఇతర సబ్జెక్టులతో కాంబినేషన్‌గా ఉన్న సబ్జెక్టులను ప్రత్యేక సబ్జెక్టులుగా ప్రవేశపెడుతోంది. ఇందులో భాగంగా ఫార్మసీ ప్రాక్టీస్, ఫార్మాసూటికల్ అనాలిసిస్, ఫార్మాసూటికల్ రెగ్యులేటరీ అఫైర్స్, ఫార్మాసూటికల్ క్వాలిటీ అషూరెన్స్ కోర్సులను నిర్వహించేందుకు కాలేజీలకు అనుబంధ గుర్తింపు జారీ చేయనుంది. మరోవైపు పెద్దగా డిమాండ్ లేని హాస్పిటల్ అండ్ క్లినికల్ ఫార్మసీ, ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ అండ్ క్వాలిటీ అషూరెన్స్, ఫార్మాస్యూటికల్ మేనేజ్‌మెంట్ అండ్ రెగ్యులేటరీ అఫైర్స్, క్వాలిటీ అషూరెన్స్ కోర్సులను తొలగించింది.
Published date : 04 Feb 2020 04:26PM

Photo Stories