Skip to main content

ఈ ఏడాది ఇంజనీరింగ్‌లో మిగిలిపోయిన సీట్లు 19,276.. కొత్త కోర్సుల్లోనూ ఖాళీలే!

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీల్లో భారీగా 19,276 సీట్లు మిగిలిపోయాయి.

181 ఇంజనీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 70,120 సీట్ల భర్తీకి చర్యలు చేపట్టారు. అందులో మొదటి దశ నుంచి చివరి దశ కౌన్సెలింగ్ వరకు 50,844 సీట్లు (72.5 శాతం) భర్తీ అయ్యాయి. మరో 19,276 సీట్లు మిగిలిపోయాయి. ఇక 175 బీఫార్మసీ, ఫార్మ్-డీ కాలేజీల్లో 3,959 సీట్ల (ఎంపీసీ స్ట్రీమ్) భర్తీకి చర్యలు చేపట్టగా, అందులో 165 సీట్లు (4.2 శాతం) మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా 3,794 సీట్లు మిగిలిపోయాయి. ఎంసెట్ చివరి దశ ప్రవేశాల సీట్ల కేటాయింపును ప్రవేశాల కమిటీ గురువారం ప్రకటించింది. ఎంసెట్‌లో 89,572 మంది విద్యార్థులు అర్హత సాధించగా, 62,499 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. అందులో ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఫార్మ్-డీ కోర్సులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకొని, మొదటి విడత కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారిలో 37,771 మంది కాలేజీల్లో చేరారు. మిగతా వారికి ప్రస్తుత చివరి విడత కౌన్సెలింగ్‌లో సీట్లను కేటాయించారు. మొత్తంగా ఇంజనీరింగ్, బీఫార్మసీ, ఫార్మ్-డీలో 23,070 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇక 2,777 మంది వెబ్ ఆప్షన్లను ఇచ్చుకున్నా వారికి సీట్లు లభించలేదు. 38 కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయి. అందులో 12 యూనివర్సిటీ కాలేజీలుండగా, 26 ప్రైవేటు కాలేజీలున్నాయి. మూడు కాలేజీల్లో ఒక్క విద్యార్థి చేరలేదని ప్రవేశాల క్యాంపు అధికారి బి.శ్రీనివాస్ వెల్లడించారు.

నవంబర్ 17వ తేదీలోగా చేరికలు..
ఇక సీట్లు పొందిన విద్యార్థులు ఈనెల 17వ తేదీలోగా వెబ్‌సైట్ (https://tseamcet.nic.in) ద్వారా నిర్దేశిత ఫీజు చెల్లించి (పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించే వారికి జీరో చూపిస్తుంది) ఆయా కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ తప్పనిసరిగా చేయాలని శ్రీనివాస్ సూచించారు. లేకపోతే ఆ సీటు రద్దవుతుందని హెచ్చరించారు. క్రెడిట్/డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫీజు చెల్లించవచ్చన్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాక అడ్మిషన్ నంబర్‌తో కూడిన అలాట్‌మెంట్ ఆర్డర్ వస్తుందని, దానిని డౌనోలోడ్ చేసుకోవాలని వెల్లడించారు. విద్యార్థులు సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీల సెట్, ఒరిజినల్ టీసీతో కాలేజీకి వెళ్లాలని వివరించారు. సీటు రద్దు చేసుకోవాలనుకునే వారు ఈనెల 17వ తేదీలోగా తమ వెబ్‌సైట్ ద్వారా సీట్ క్యాన్సలేషన్ బటన్ నొక్కి సీటును రద్దు చేసుకోవచ్చన్నారు. మొదటి దశలో సీట్లు పొంది ఫీజు చెల్లించిన వారు ఆ సీటును రద్దు చేసుకుంటే 50 శాతం ఫీజు వెనక్కి తిరిగి ఇస్తామన్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే సమయంలో ఆయా విద్యార్థులు డిగ్రీలో సీటు వదులుకుంటున్నట్లు ఆన్‌లైన్‌లోనే అండర్‌టేకింగ్ ఇవ్వాలని వివరించారు.

కొత్త కోర్సుల్లోనూ మిగిలిన సీట్లు..
ఇటు ఇంజనీరింగ్ కొత్త కోర్సుల్లోనూ సీట్లు మిగిలిపోయాయి. కొన్ని సాధారణ కాలేజీల్లోనూ కొత్త కోర్సులకు అనుమతి లభించినా వాటిల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపలేదు. ఒక్క బిజినెస్ సిస్టమ్స్‌లో 84.13 శాతం సీట్లు భర్తీ కాగా మిగతా అన్ని కోర్సుల్లో 68 శాతంలోపే సీట్లు భర్తీ అయ్యాయి. కొత్త కోర్సుల్లో కన్వీనర్ కోటాలో 12,660 సీట్లుండగా, అందులో 7,198 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. అంటే 5,462 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. ఇక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్-ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్‌లో (సీఎస్‌ఈ ఏఐఎంఎల్) 5,310 సీట్లుండగా, 3,574 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. 1,736 సీట్లు ఖాళీగా ఉండిపోయాయి. సీఎస్‌ఈ డేటా సైన్స్ లో 3,213 సీట్లుండగా 1,952 భర్తీ అయ్యాయి. 1,261 సీట్లు మిగిలిపోయాయి. సీఎస్‌ఈ సైబర్ సెక్యూరిటీలోనూ 1,848 సీట్లు ఉండగా, 1,130 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి.

ఇంజనీరింగ్ కోర్సుల వారీగా సీట్ల పూర్తి వివరాలు..

బ్రాంచీ

సీట్లు

కేటాయింపు

ఖాళీ

కేటాయింపు శాతం

సీఎస్‌ఈ ఏఐఎంఎల్

5,310

3,574

1,736

67.31

సీఎస్‌ఈ డేటా సైన్స్

3,213

1,952

1,261

60.75

సీఎస్‌ఈ సైబర్ సెక్యూరిటీ

1,848

1,130

718

61.15

సీఎస్‌ఈ ఇంటర్నల్ ఆఫ్ థింగ్స్

1,281

579

702

45.2

సీఎస్‌ఈ బిజినెస్ సిస్టమ్స్

252

212

40

84.13

కంప్యూటర్ ఇంజనీరింగ్

210

35

175

16.67

ఏఐ అండ్ డేటా సైన్స్

168

168

0

100

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

126

126

0

100

ఐవోటీ అండ్ సైబర్ సెక్యూరిటీ

126

58

68

46.03

సీఏసీఈ నెట్‌వర్క్స్

126

84

42

66.67


మరి కొన్ని ప్రధాన బ్రాంచీల వారీగా సీట్ల వివరాలు..

బ్రాంచీ

సీట్లు

కేటాయింపు

ఖాళీ

కేటాయింపు శాతం

సీఎస్‌ఈ

16,981

15,703

1,278

92.47

ఈసీఈ

13,657

10,298

3,359

75.4

ఈఈఈ

6,928

3,738

3,190

53.95

సివిల్

6,420

3,579

2,841

55.75

మెకానికల్

6,135

2,910

3,225

47.43

ఐటీ

4,755

4,613

142

97.01

సీఎస్‌ఐటీ

378

272

106

71.96

మైనింగ్

366

136

230

37.16

కెమికల్

246

246

0

100

ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్

238

184

54

77.31

ఏరోనాటికల్ ఇంజనీరింగ్

210

210

0

100

ఈసీఎం

210

183

27

87.14


ఇవీ సీట్లు, కేటాయింపు వివరాలు...
ఫార్మసీలో (ఎంపీసీ స్ట్రీమ్)..

కేటగిరీ

కాలేజీలు

మొత్తం సీట్లు

భర్తీ అయినవి

ఖాళీ

భర్తీ శాతం

యూనివర్సిటీ

03

80

48

32

60.0

ప్రైవేటు

116

3,329

82

3,247

2.5

మొత్తం

119

3,409

130

3,279

3.8

ఫార్మ్-డీ (ప్రైవేటు)56

550

35

515

6.4

 

మొత్తం

175

3,959

165

3,794

4.2

Published date : 13 Nov 2020 04:23PM

Photo Stories