Skip to main content

ఈ ఏడాది 200 ఇంజనీరింగ్ కళాశాలలు మూత

న్యూఢిల్లీ: సరైన మౌలిక వసతులు.. సరిపడా సిబ్బంది.. అవసరమైన స్థాయిలో విద్యాప్రమాణాలు లేని 200 ఇంజనీరింగ్ కళాశాలలు ఈ ఏడాది మూతపడుతున్నాయని అఖిలభారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) ప్రకటించింది.
వచ్చే పన్నెండు నెలల్లోపు ఈ కాలేజీలను మూసివేసే ప్రక్రియ పూర్తవుతుందని తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరంలో ఇంజనీరింగ్ సీట్ల సంఖ్య 80,000 తగ్గుతుందని వెల్లడించింది. అయితే ఇది ఈ ఏడాది మాత్రమే జరుగుతున్నది కాదని, గత నాలుగేళ్లలో 3 లక్షల పదివేల సీట్లు తగ్గాయని... ఇంజనీరింగ్ కాలేజీల సంఖ్య కూడా 2012 నుంచి ఇప్పటి వరకు 1.86 లక్షలకు తగ్గిందని తెలిపింది. 2016 వరకు సీట్లు పొందిన విద్యార్థులకు మాత్రమే ప్రస్తుతమున్న కాలేజీలు బోధనను కొనసాగిస్తాయని, ఆ తర్వాత వాటిని మూసివేస్తామని స్పష్టంచేసింది. ఒక్కసారిగా ఇన్ని కాలేజీలు మూతపడుతుండడంతో 75వేల నుంచి 80 వేల వరకు సీట్లు తగ్గుతాయని ఏఐసీటీఈ వెల్లడించింది.

ప్రస్తుత బ్యాచ్‌కు ఇబ్బంది లేదు..
ఈ కాలేజీలు మూతపడడానికి కారణం కొత్త విద్యార్థులు చేరకపోవడమేనని, దీనివల్ల నిర్వహణ భారంగా మారుతుండడంతో కాలేజీలను మూసివేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ 200 కాలేజీలు దరఖాస్తు చేసుకున్నాయని ఏఐసీటీఈ తెలిపింది. అయితే ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ కోర్సులను పూర్తిచేసే వరకు మూతపడడానికి సిద్ధంగా ఉన్న కాలేజీలన్నీ కొనసాగాల్సిందేనని ఏఐసీటీఈ చైర్‌పర్సన్ అనిల్ సహస్రబుద్ధే స్పష్టంచేశారు. మూసివేసేందుకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్న అన్ని కాలేజీలు మూతపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ కాలేజీల్లో కొత్తగా అడ్మిషన్లు ఉండవని, కొత్త విద్యార్థులను చేర్చుకోవద్దని సూచించారు. తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో కాస్త అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

కొన్నింట్లో పెరిగే అవకాశం..
భారీస్థాయిలో కాలేజీలు మూతపడే అవకాశమున్నందున ఎన్‌ఐటీ, ఐఐటీ వంటివాటిలో సీట్ల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. ఇందుకోసం ఇప్పటికే తమకు దరఖాస్తులు అందాయని, వాటికి సీట్ల సంఖ్యను పెంచుకునేందుకు అనుమతిని ఇచ్చే విషయమై ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.

గుర్తింపు తప్పనిసరి..
ఇకపై ఇంజనీరింగ్ కాలేజీలన్నీ నేషనల్ అక్రిడేషన్ బోర్డు(ఎన్‌బీఏ) నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సహస్రబుద్ధే సూచించారు. 2022 నాటికి ఇంజనీరింగ్ కాలేజీల్లో కొత్త కోర్సులు వచ్చే అవకాశమున్నందున ఈ గుర్తింపును తప్పనిసరి చేస్తున్నామని చెప్పారు. ఎన్‌బీఏ గుర్తింపు పొందిన కోర్సులను మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీల్లో బోధించే అనుమతి ఉంటుందన్నారు. ప్రస్తుతం 10 శాతం కోర్సులకు కూడా ఎన్‌బీఏ అనుమతి లేదని సహస్రబుద్ధే చెప్పారు.
Published date : 09 Apr 2018 02:48PM

Photo Stories