ఏపీలో ఇంజనీరింగ్ యాజమాన్య కోటాకు గ్రీన్ సిగ్నల్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల యాజమాన్య కోటా (బీ కేటగిరి) సీట్ల భర్తీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది.
ఆయా కాలేజీల యాజమాన్యాలు బీ కేటగిరి సీట్ల భర్తీకి విద్యార్థులనుంచి దరఖాస్తులు కోరుతూ ఈనెల 25లోపు పత్రికల్లో ప్రకటనలు జారీచేయాలి. జులై 31వరకు అర్హులైన అభ్యర్థులనుంచి దరఖాస్తులు స్వీకరించాలి. ఆయా కోర్సుల సీట్లకు ఎంపికైన అభ్యర్థుల మొదటి జాబితాను ఆగస్టు 3వ తేదీన కాలేజీ నోటీసుబోర్డుల్లో, వెబ్‌సైట్లలో ప్రదర్శించాలి. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 6వ తేదీలోపు ఆయా కాలేజీల్లో చేరుతున్నట్లు రిపోర్టు చేయాలి. ఆగస్టు 10వ తేదీలోపు అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేయాలి. రెండో జాబితాలోని విద్యార్థులు ఆగస్టు 12వ తేదీలోగా కాలేజీల్లో రిపోర్టుచేయాలి. మేనేజ్‌మెంట్ సీట్లలో 15 శాతానికి మించకుండా ఎన్‌ఆర్‌ఐ కోటాను భర్తీచేయాలి. మిగతా సీట్లను జేఈఈ మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారితో ఎంసెట్ మెరిట్ జాబితా ఆధారంగా రాష్ట్ర విద్యార్థులతో భర్తీచేయాలి. ఇతర రాష్ట్రాల విద్యార్థుల్లో జేఈఈ మెయిన్స్ పరీక్షలో అర్హత సాధించిన వారినే తీసుకోవాలని ఉన్నత విద్యామండలి స్పష్టీకరించింది. వారికి అర్హత పరీక్షలో 50 శాతానికి తక్కువ కాకుండా మార్కులు వచ్చి ఉండాలి. కాలేజీల యాజమాన్యాలు వెబ్‌పోర్టళ్లలో ఆన్‌లైన్ దరభాస్తులు సమర్పించేలా ఏర్పాట్లుచేయాలి. విద్యార్థులు కాలేజీల్లో నేరుగా కూడా దరఖాస్తులు సమర్పించుకొనే అవకాశమివ్వాలి. అభ్యర్థులకు సీట్లు ఇవ్వలేకపోతే ఆయా యాజమాన్యాలు అందుకు కారణాలతో ఉన్నతాధికారులకు నివేదికలు సమర్పించాలి. నిర్ణీత ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేయాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే తదుపరి చర్యలకు ఆ కాలేజీలదే బాధ్యత అవుతుందని మండలి స్పష్టం చేసింది.
Published date : 23 Jul 2015 02:25PM