Skip to main content

Engineering: ఇంజనీరింగ్ మాకొద్దు..

ఒకప్పుడు ఇంజనీరింగ్ అంటే యమ క్రేజ్. ఇలా చేరడం, అలా పూర్తి చేయడం, ఉద్యోగం తెచ్చుకోవడం అన్నట్టుగా పరిస్థితి ఉండేది.
Engineering
ఇంజనీరింగ్ మాకొద్దు..

కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇంజనీరింగ్ విద్య పట్ల విద్యార్థుల్లో మోజు తగ్గుతోంది. ఏ ఐఐటీలోనో, ఎ¯న్ఐటీలోనో... లేదంటే పేరున్న కాలేజీలోనో ఇంజనీరింగ్ చేస్తే ఓకే. లేకుంటే పెద్దగా ఉపయోగం లేదని విద్యార్థులు భావిస్తున్నారు. ముఖ్యంగా కంప్యూటర్ ఆధారిత కోర్సులు మినహా ఇతర వాటి జోలికెళ్లేందుకు ఇష్టపడటం లేదు. ఇక సివిల్, మెకానికల్ అంటేనే చాలామంది ఊహూ అంటున్నారు. ప్రత్యామ్నాయంగా బీబీఏ, ఎంబీఏ వంటి మేనేజ్మెంట్ కోర్సుల వైపు దృష్టి పెడుతున్నారు. దీంతో అన్ని రాష్ట్రాల్లోనూ ఇంజనీరింగ్ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకమవుతోంది. చాలావరకు కాలేజీలు మూతపడుతున్నాయి. ఉన్న కాలేజీల్లోనూ డిమాండ్ ఉన్న బ్రాంచ్లనే నిర్వహిస్తున్నారు. ఫలితంగా తెలంగాణ సహా జాతీయ స్థాయిలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ సంఖ్య ఏటా పడిపోతోంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గణాంకాలే ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి.

సీట్లు భర్తీ అయ్యే పరిస్థితే లేదు

2014–15లో దేశవ్యాప్తంగా 31.8 లక్షల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉంటే.. 2021–22 నాటికి ఇవి 23.6 లక్షలకు తగ్గాయి. అంటే దాదాపు 8.2 లక్షల సీట్లు తగ్గిపోయాయి. మరోవైపు మేనేజ్మెంట్ కోర్సుల్లో సీట్లు ఐదేళ్ళ క్రితం 3.74 లక్షలుంటే.. ప్రస్తుతం ఇవి 4.04 లక్షలున్నాయి. చాలా కాలేజీలు ఇంజనీరింగ్ సీట్లను తగ్గించుకుంటూ, మేనేజ్మెంట్ కోర్సుల సీట్లు పెంచుకుంటున్నాయి. తెలంగాణలోనూ పేరున్న కాలేజీలు మినహా మెజారిటీ ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి దినదిన గండంగానే ఉంది. గడచిన ఏడేళ్ళుగా దాదాపు 74 ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోనే 20 కాలేజీలు బంద్ అయ్యాయి. జిల్లాల్లో పరిస్థితి మరీ దారుణం. కొన్ని కాలేజీలను జిల్లాల నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు మార్చుకున్నారు. 2014లో నిర్వహించిన ఎంసెట్ కౌన్సెలింగ్లో 250 వరకూ కాలేజీలు పాల్గొన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న కౌన్సెలింగ్లో ఈ జాబితా 175కు చేరడం గమనార్హం. తాజాగా మరో నాలుగు కాలేజీలు మూత వేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాయి. డిమాండ్ ఉన్న కోర్సులు పెంచుకుంటే తప్ప కాలేజీలు మనుగడ సాగించే పరిస్థితి కన్పించడం లేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సివిల్, మెకానికల్ బ్రాంచ్లలో 2 వేల సీట్లు కోత పెట్టారు. కంప్యూటర్ ఆధారిత కోర్సులైన ఆర్టిఫీషియల్ ఇంటిలిజె¯Œ్స, డేటా సై¯Œ్స బ్రాంచీల్లో 1,800 సీట్లు పెంచారు. అయినా 80 శాతం కాలేజీల్లో అన్ని బ్రాంచీల్లో సీట్లు భర్తీ అయ్యే పరిస్థితి కన్పించడం లేదు.

46.82 శాతం మందికే ఉద్యోగాలు!

దేశవ్యాప్తంగా ఏటా 20 లక్షల మందికిపైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ బయటకొస్తున్నారు. వీరిలో సీఎస్సీ, ఎలక్ట్రానిక్స్ వాళ్ళే 60 శాతం ఉంటున్నారు. వీరితో పాటు ఇతర బ్రాంచ్ల వారికి సంబంధిత ఉద్యోగాలు లభించడం లేదు. ఇతరత్రా సాధారణ ఉద్యోగాలు చేసే పరిస్థితి ఉంటోంది. సీఎస్సీ, ఎలక్ట్రానిక్స్ గ్రూపుల్లో ఎప్పటికప్పుడు సాంకేతికత మారుతోంది. దీన్ని అందుకోవడానికి కొత్త కోర్సులు చేయాలి. ఇది పూర్తయ్యేలోగా పోటీ మరింత పెరుగుతోంది. సివిల్, మెకానికల్ కోర్సులు పూర్తి చేసిన వాళ్ళు సాఫ్ట్వేర్ వైపుకు మళ్ళడం కష్టంగా ఉంది. ఆ రంగంలోనూ పూర్తిస్థాయిలో ఉపాధి లభించడం లేదు. ఇండియా స్కిల్స్ తాజా నివేదికల ప్రకారం ఇంజనీరింగ్ విద్యార్థుల్లో 46.82 శాతం మందికే ఉద్యోగాలొస్తున్నాయని తేలింది. మార్కెట్కు కావాలి్సన స్కిల్స్ ఇంజనీరింగ్ కాలేజీల్లో కొరవడటమే ఉపాధి అవకాశాలు సన్నగిల్లడానికి కారణంగా పేర్కొంది. అయితే మేనేజ్మెంట్ కోర్సులైన బీబీఏ, ఎంబీఏ పూర్తి చేసిన వారిలోనూ 46.59 శాతమే ఉపాధి పొందుతున్నారని తెలిపింది. ఈ కోర్సుల్లోనూ నాణ్యత పెరగాల్సిన అవసరాన్ని నివేదిక స్పష్టం చేసింది.

ఆదరణ కొరవడిన సివిల్, మెకానికల్..

పరిశ్రమల్లో ప్రస్తుతం ఆధునిక టెక్నాలజీ రాజ్యమేలుతోంది. సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్ అనుసంధానమై పనిచేస్తున్నాయి. సివిల్, మెకానికల్ కోర్సులు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా లేవనే అభిప్రాయం బలపడుతోంది. ఫలితంగా ఈ కోర్సుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తెలంగాణలో తాజాగా నిర్వహించిన కౌన్సెలింగ్లో సీఎస్సీలో 38,796 సీట్లు అందుబాటులో ఉంటే, 37,073 (95.56 శాతం) భర్తీ అయ్యాయి. ఎలక్ట్రానిక్స్లో 13,935 సీట్లు ఉంటే, 12,308 (88.32 శాతం) భర్తీ అయ్యాయి. ఈఈఈ, సివిల్, మెకానికల్ బ్రాంచ్ల్లో తక్కువ సీట్లే ఉన్నా.. వాటిల్లోనూ భర్తీ 50 శాతం మించలేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ విద్యను సంస్కరించాలి్సన అవసరం ఉందని విద్యా రంగ నిపుణులు సూచిస్తున్నారు.
చదవండి:

UPSC Engineering Services (Preliminary) Notification 2022

IIT Kanpur Recruitment: ఐఐటీ, కాన్పూర్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల‌

Published date : 23 Sep 2021 01:53PM

Photo Stories