Skip to main content

ఎంసెట్‌లో యాజమాన్యాల కుట్ర... మేనేజ్‌మెంట్ సీట్లను బ్లాక్ చేసుకునే ఎత్తుగడ

హైదరాబాద్: యాజమాన్య కోటాలోని ఒక్క మెడికల్ సీటును బ్లాక్ చేస్తే కోటి రూపాయలు జేబులో ఉన్నట్లే! ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒక్క సీటును ఆపుకోగలిగితే కనీసం రూ. 3 లక్షలు వచ్చినట్టే!! అందుకే యాజమాన్యాలు పక్కా వ్యూహంతో ఎంసెట్‌ను హైజాక్ చేస్తున్నాయి. ఇప్పటికే తమ కాలేజీలో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను రంగంలోకి దించి ఎంట్రెన్స్ పరీక్షను రాయిస్తున్నాయి. ఇందుకోసం మెరికల్లాంటి విద్యార్థులకు కొంత మొత్తం ముట్టజెబుతాయి. వారితో తమ కాలేజీలోని మేనేజ్‌మెంట్ కోటా సీట్లను బ్లాక్ చేయించే ఎత్తుగడను అమలు చేస్తున్నాయి. ప్రవేశాలకు సంబంధించిన ప్రక్రియ ముగిసిన తర్వాత ఆ సీట్లను ఎక్కువ రేటుకు అమ్ముకునేందుకే ఈ అక్రమాలకు తెరలేపాయి. సదరు విద్యార్థులు తమ అడ్మిషన్‌ను రద్దు చేసుకుంటే వారి స్థానంలో మరొకరిని చేర్చుకునే వెసులుబాటు యాజమాన్యాలకు ఉంటుంది. ఇలా సీట్లను ఇష్టారాజ్యంగా అమ్ముకునేందుకు వీలు చిక్కుతుంది. ఈసారి ఇలాంటి విద్యార్థుల సంఖ్య దాదాపు 2 వేల వరకు ఉంది. దరఖాస్తుల పరిశీలన లో ఈమేరకు ఎంసెట్ అధికారులు గుర్తించారు. గతంలో మంచి ర్యాం కులు సాధించి అడ్మిషన్లు పొందిన వారు మళ్లీ ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్న వ్యవహారాన్ని పోలీసులకు అప్పగించారు. సోమవారం దీనిపై ఎంసెట్ విభాగం అధికారులు పోలీసులతో ఉన్నతస్థాయి సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. అలాంటి విద్యార్థులపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాయడంపైనా అధికారులు దృష్టి పెట్టారు. హైటెక్ మాస్ కాపీయింగ్ విషయంలోనూ పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.

మెడికల్‌కు పెరిగిన దరఖాస్తులు
ఇప్పటివరకు ఎంసెట్‌కు మొత్తంగా 3,94,440 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అగ్రికల్చర్ అండ్ మెడికల్ కోసం 1,11,746 దరఖాస్తులు రాగా.. ఇంజనీరింగ్ కోసం 2,81,566 మంది దరఖాస్తు చేసుకున్నారు. 1,128 మంది రెండింటికీ దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 19 వరకూ రూ. 10 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకునే అవకాశముంది. ఇప్పటికే ఇంజనీరింగ్‌లో చేరి మళ్లీ దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 1500లకు పైగా ఉంది. అలాగే మెడికల్, అగ్రికల్చర్ కోర్సులు చేస్తున్న 500 మందికిపైగా విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. ఇక గత ఏడాది ఇంజనీరింగ్ కోసం 2,91,083 మంది, మెడికల్‌కు 1,05,070 మంది దరఖాస్తు చేసుకున్నారు.
Published date : 12 May 2014 11:31AM

Photo Stories