Skip to main content

ఎంసెట్ కౌన్సెలింగ్‌కు వేరుగా నోటిఫికేషన్

తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్: టి.పాపిరెడ్డి
ధువపత్రాల పరిశీలనకు వీలైతే రేపే నోటిఫికేషన్
‘సుప్రీం’ తీర్పును బట్టి 12 నుంచి ప్రక్రియ ధ్రువీకరించు
వెబ్ ఆప్షన్లు మాత్రం ఉమ్మడిగా చేపట్టే అవకాశం
విద్యార్థులెవరూ ఆందోళన చెందవద్దని సూచన
నేడు టీ ఉన్నత విద్యా మండలి సమావేశం

సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి విద్యార్థుల ధ్రువపత్రాల తనిఖీకి తెలంగాణలో వేరుగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి సిద్ధమైంది. వీలయితే ఈ నెల 9న నోటిఫికేషన్ జారీ చేసి.. 12 నుంచి వెరిఫికేషన్ చేపట్టే అవకాశం ఉంది. వెబ్ ఆప్షన్లను మాత్రం రెండు రాష్ట్రాలకు కలిపి ఒకేసారి చే పట్టే అవకాశం ఉంది. మండలి చైర్మన్‌గా గురువారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే 11వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పును బట్టి సర్టిఫికెట్ల తనిఖీ, వెబ్ ఆప్షన్లు, ఇతర అంశాలపై తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు.

ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో గురువారం సాయంత్రం 4 గంటలకు పాపిరెడ్డి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు కార్యాలయం రెండో అంతస్తులోని ప్రస్తుత కార్యదర్శి చాంబర్‌ను కేటాయించారు. అనంతరం పాపిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి సమావేశాన్ని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకునిర్వహిస్తామని.. ఇందులో ఎంసెట్‌కు సంబంధించిన అన్ని అంశాలను చర్చిస్తామని ఆయన తెలిపారు. తెలంగాణకు వేరుగా ధ్రువపత్రాల తనిఖీ షెడ్యూలును ప్రకటిస్తామని.. ఏపీ మండలి అధికారులతో సమన్వయం చేసుకుంటూముందుకు సాగుతామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పునకు, రాష్ట్ర విభజన చ ట్టంలోని నిబంధనలకు లోబడే ఈ ప్రక్రియ చేపడతామని.. ఆ మేరకే ప్రవేశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ప్రవేశాల ప్రక్రియ అనుకున్నంత త్వరగా పూర్తి కాకపోవచ్చని, అయితే విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాపిరెడ్డి భరోసా ఇచ్చారు. ప్రవేశాల ప్రక్రియ గతంలోనూ ఆలస్యం అయిందని, ప్రస్తుతం విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా చూస్తామని చెప్పారు. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ హెల్ప్‌లైన్ కేంద్రాలకు సంబంధించి ఇంకా అన్ని ఏర్పాట్లు పూర్తి కాలేదన్నారు. సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌తో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు పాపిరెడ్డి చెప్పారు. తాము చేపట్టబోయే ప్రక్రియ కామన్ అడ్మిషన్ విధానం ప్రకారమే ఉంటుందని, కోటా విషయంలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఎలాంటి నష్టం ఉండదని తెలిపారు. కాగా బాధ్యతల స్వీకరణ సందర్భంగా పాపిరెడ్డి వెంట విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, ప్రభుత్వ సలహదారు పాపారావు, జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు తదితరులు వెంట ఉన్నారు. అనంతరం ఏపీ మండలి చైర్మన్ వేణుగోపాల్‌రెడ్డిని ఆయన మర్యాదపూర్వకంగా కలిసి, కాసేపు చర్చించారు. పాపిరెడ్డి అంతకుముందు గవర్నర్ నరసింహన్‌ను కూడా కలిసి వచ్చారు.
Published date : 08 Aug 2014 04:23PM

Photo Stories