ఏఐసీటీఈ అధికారాలను మాకు ఇవ్వండి: యూజీసీకి రాష్ట్ర ఉన్నత విద్యామండలి లేఖ
Sakshi Education
హైదరాబాద్: రాష్ట్రంలో వృత్తి విద్యా కాలేజీల పర్యవేక్షణ, కొత్త కాలేజీలకు అనుమతులు, అదనపు సీట్ల మంజూరు వంటి బాధ్యతలను ఇన్నాళ్లుగా నిర్వర్తించిన అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అధికారాలన్నింటిని తమకు అప్పగించాలని రాష్ట్ర ఉన్న త విద్యా మండలి తాజాగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ)కి లేఖ రాసింది. వృత్తి విద్యా కాలేజీల పర్యవేక్షణ, అనుమతుల వంటి వ్యవహారాలపై ఏఐసీటీఈకి అధికారం లేదని, అది కేవలం సలహా విభాగం మాత్రమేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ మేరకు ఆ అధికారాలను తనకు అప్పగించాలంటూ యూజీసీని ఉన్నత విద్యా మండలి కోరింది. దీనిపై యూజీసీ నుంచి నిర్ణయం త్వరలోనే వస్తుందని విద్యా మం డలి వర్గాలు భావిస్తున్నాయి. అలాగే.. గతంలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (దూరవిద్యా మండలి) ఉండగా.. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ దానిని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బోర్డు పేరుతో యూజీసీలో ఒక విభాగంగా చేర్చింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏఐసీటీఈని కూడా యూజీసీలో ఒక సలహా విభాగంగానే కొనసాగించాలని యూజీసీ వర్గాలు భావిస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి వర్గాలకు సమాచారం అందింది. ఈ పరిస్థితుల్లో వృత్తి విద్యా కాలేజీల వ్యవహారాలను ఇకపై యూనివర్సిటీలకు అప్పగిస్తారా? లేదా? అనే అంశంపైనా చర్చ జరుగుతోంది. అయితే స్థానికంగా యూనివర్సిటీలు ఉన్నా.. అవి పర్యవేక్షక విభాగాలుగా కొనసాగుతాయని, ఆ అధికారాలను తనకు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఉన్నత విద్యా మండలి కోరింది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వమే అనుమతుల వ్యవహారాలను చూస్తే.. అవి ఉన్నత విద్యా మండలి నేతృత్వంలోనే కొనసాగుతాయని అధికారులు భావిస్తున్నారు. కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి దీనిపై తుది నిర్ణయం రావాల్సి ఉంది.
Published date : 10 Mar 2014 11:47AM