Skip to main content

చుక్కలు చూపిన జేఎన్టీయూహెచ్!

సాక్షి, హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించిన అభ్యర్థులకు జేఎన్టీయూహెచ్ విశ్వవిద్యాలయం చుక్కలు చూపించింది.
దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి రోజైన సెప్టెంబర్ 12న కూడా (https://tspri.cgg. gov.in/) వెబ్‌సైట్ మొరాయించడంతో రాష్ట్రవ్యాప్తంగా వేల మంది అభ్యర్థులు నిరాశకు గురయ్యారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 9,533 జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన బాధ్యతలను పంచాయతీరాజ్ శాఖ జేఎన్టీయూహెచ్‌కు అప్పగించింది. దీంతో జేఎన్టీయూహెచ్ ఈ నెల 3 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. సెప్టెంబర్ 12వ తేదీ అర్ధరాత్రి వరకు దరఖాస్తు చేసుకోవడానికి సమయం ఉండగా.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫీజు చెల్లింపు గడువు మాత్రం మంగళవారంతోనే ముగిసింది. చివరి రెండు రోజులైన సోమ, మంగళవారాల్లో వేలాది అభ్య ర్థులు వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నించడంతో సర్వర్ డౌన్ అయింది. సోమవారమే సర్వర్ డౌన్ కాగా, మంగళవారం దీన్ని పునరుద్ధరించేందుకు జేఎన్టీయూహెచ్ ఐటీ విభాగం చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తక్కువ సామర్థ్యం ఉన్న సర్వర్ ఆధారంగా దరఖాస్తుల స్వీకరణ వెబ్‌సైట్ ఏర్పాటు చేయడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతాయని ఐటీ నిపుణులు పేర్కొంటున్నారు.

మీ సేవ కేంద్రాల్లో పడిగాపులు
దరఖాస్తు చేసుకోవడానికి ముందు అభ్యర్థులు వెబ్‌సైట్‌లో తమ ప్రాథమిక వివరాలు, మొబై ల్ నంబర్‌ను తెలిపి ‘యూజర్ రిజిస్ట్రేషన్’ ఖాతా తెరవాల్సి ఉంటుంది. దీంతో గత 2 రోజులుగా అభ్యర్థులు యూజర్ రిజిస్ట్రేషన్ ఖాతాలు తెరవడానికి గంటల తరబడి మీ- సేవ, ఇంటర్నెట్ కేంద్రాల వద్ద తంటాలు పడ్డా రు. ఖాతా తెరవడానికి ప్రయత్నించిన చాలా మందికి.. ‘సరైన పుట్టిన తేదీ’తెలపాలని వెబ్‌సైట్ నుంచి నోటిఫికేషన్లు వచ్చాయి. వందల సార్లు రిజిస్ట్రేషన్ కోసం వివరాలు సబ్మిట్ చేసినా.. అభ్యర్థుల ఫోన్లకు ఓటీపీ రాలేదు. హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయం ఉన్న కంప్యూటర్ల ద్వారా కొందరు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలు కూడా సఫలం కాలేదు. ఇంకొందరికి ఆన్‌లైన్ వెబ్‌సైట్ లో దరఖాస్తులు ఓపెన్ అయినా.. వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపాల వల్ల అవీ తిరస్కరణకు గురయ్యాయి.

ఎట్టకేలకు గడువు పెంపు..
సాంకేతిక సమస్యల కారణంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు దరఖాస్తు చేసుకోలేకపోయిన వారి కోసం ఎట్టకేలకు తుది గడువును ప్రభుత్వం మరో 3 రోజులు పొడిగించింది. మంగళవారంతో ముగిసిన ఫీజు చెల్లింపు గడువును సెప్టెంబర్ 14 వరకు పొడిగించింది. ఇక 12వ తేదీతో ముగియనున్న దరఖాస్తుల సమర్పణ గడువును 15 వరకు పొడిగించింది. అలాగే పరీక్ష తేదీని కూడా అక్టోబర్ 4కు వాయిదా వేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల సమర్పణకు ఇబ్బందులు తలెత్తడంతో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాల మేరకు గడువు పొడిగిస్తూ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
Published date : 12 Sep 2018 03:12PM

Photo Stories