బాసర ట్రిపుల్‌ఐటీకి 530 మంది మోడల్ స్కూళ్ల విద్యార్థులు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని 194 మోడల్ స్కూళ్లలో చదివిన 530 మంది విద్యార్థులకు బాసరలోని రాజీవ్‌గాంధీ విద్యా వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయంలో (ట్రిపుల్‌ఐటీ) ఇంటిగ్రేటెడ్ బీటెక్ చదివేందుకు సీట్లు లభించాయని మోడల్ స్కూల్స్ అదనపు డెరైక్టర్ సత్యనారాయణరెడ్డి తెలిపారు.
వారంతా 2018-19 విద్యా సంవత్సరంలో తమ మోడల్ స్కూళ్లలో పదో తరగతి పూర్తి చేసుకున్నవారేనని పేర్కొన్నారు. ఆయా విద్యార్థులు 2019-20 విద్యా సంవత్సరంలో ఇంటిగ్రేటెడ్ బీటెక్‌లో చేరినట్లు వెల్లడించారు. వర్సిటీలో మొత్తంగా 1,500 సీట్ల భర్తీ చేపట్టగా, అందులో 530 మంది తమ విద్యార్థులే ఉన్నారని వివరించారు. గత మార్చిలో జరిగిన పదో తరగతి పరీక్షలకు 17,434 మంది హాజరు కాగా, అందులో 17,163 మంది (98.45 శాతం) ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. వారిలో 210 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించినట్లు పేర్కొన్నారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) పరీక్ష నిర్వహించి, ఎంపిక చేసే నేషనల్ మీన్‌స కమ్ మెరిట్ స్కాలర్‌షిప్‌కు (ఎన్‌ఎంఎంఎస్) 873 మంది ఎంపికయ్యారని సత్యనారాయణరెడ్డి వెల్లడించారు.
Published date : 13 Dec 2019 05:20PM