ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులే లక్ష్యం..: డేటా సైంటిస్ట్ సిద్ధార్థ్
Sakshi Education
తెనాలి: ‘గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం కంపెనీల్లో రీసెర్చ్ అండ్ అనాలసిస్ విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో జరుగుతున్న ప్రాజెక్టుల్లో భాగస్వామిని కావాలన్నదే నా లక్ష్యం..
ఓ మంచి గేమ్ డిజైన్ చేయాలన్నది నా డ్రీమ్’ అని హైదరాబాద్‌లోని ‘మోంటెగ్‌న’ ఐటీ కంపెనీ డేటా సైంటిస్ట్.. 12 ఏళ్ల సిద్ధార్థ్ చెప్పాడు. ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నానని తెలిపాడు. తన తల్లిదండ్రులు ప్రియమానస, రాజ్‌కుమార్‌తో కలిసి వీకెండ్‌కు స్వస్థలమైన గుంటూరు జిల్లా తెనాలి వచ్చాడు. ఏడో తరగతిలోనే రూ.25 వేల వేతనం పొందుతున్న ఈ బాలమేధావిని ‘సాక్షి’ పలకరించగా పలు విషయాలు పంచుకున్నాడు. తన తండ్రి శిక్షణలో కంప్యూటర్‌పై పట్టు సాధించి.. పలు కంపెనీలకు రెజ్యూమ్ పంపినట్టు చెప్పాడు. అయితే ఏడో తరగతి చదువుతున్నానని చెప్పడంతో అభినందించి వారు ఫోన్‌లు పెట్టేసేవారని తెలిపాడు. తర్వాత మోంటెగ్‌న స్మార్ట్ బిజినెస్ ప్రయివేట్ సొల్యూషన్స్ అనే ఐటీ కంపెనీకి రెజ్యూమ్ పంపగా.. సీఈవోనే తనను ఇంటర్వ్యూ చేసి ఉద్యోగం ఇచ్చారన్నాడు. కంపెనీతో పాటు పాఠశాల యాజమాన్యం కూడా మూడు రోజుల హాజరుకు తనకు అనుమతించారని పేర్కొన్నాడు. మైక్రోసాఫ్ట్ లాంటి అప్లికేషన్ రూపకల్పన చేయాలన్న ఆశయంతో ప్రతి క్షణం కష్టపడుతున్నానని సిద్ధార్థ్ వివరించాడు.
Published date : 18 Nov 2019 04:23PM