Skip to main content

అన్ని కాలేజీలనూ చేర్చండి.. ఇంజనీరింగ్ పీజీ కౌన్సెలింగ్‌పై హైకోర్టు ఆదేశం

  • లోపాలను సవరించుకుంటామని హామీ ఇవ్వాలని కాలేజీలకు సూచన
  • సవరించుకోకుంటే చర్యలు తీసుకునే స్వేచ్ఛ జేఎన్టీయూహెచ్‌కు ఉందని వెల్లడి
  • కోర్టు ఆదేశాలపై అప్పీలు చేయనున్న జేఎన్‌టీయూహెచ్?
హైదరాబాద్: ఇంజనీరింగ్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం 10వ తేదీ నుంచి జరిగే వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో అన్ని ఇంజనీరింగ్ కాలేజీలను చేర్చాలని హైకోర్టు గురువారం జేఎన్టీయూహెచ్‌ను ఆదేశించింది. లోపాలన్నింటినీ కౌన్సెలింగ్ జాబితాలో చేర్చడానికి ముందే సవరించుకుంటామంటూ జేఎన్టీయూహెచ్‌కు రాతపూర్వక హామీ ఇవ్వాలని కాలేజీలకు హైకోర్టు స్పష్టం చేసింది. జాబితాలో చేర్చిన తరువాత కాలేజీలు లోపాలను సవరించుకోకుంటే.. నిబంధనల మేరకు వాటిపై చర్యలు తీసుకోవచ్చంటూ వర్సిటీకి స్వేచ్ఛనిచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కాలేజీల్లో లోపాలను సవరించుకున్నప్పటికీ జేఎన్టీయూహెచ్ అఫిలియేషన్ ఇచ్చే ప్రక్రియను పూర్తి చేయలేదని, దాన్ని పూర్తి చేసిన తరువాతే కౌన్సెలింగ్ నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయాలంటూ దాదాపు 45 ఇంజనీరింగ్ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం విచారణ జరిగింది.

ర్సిటీపై నమ్మకం లేదు..: పిటిషనర్లు
ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా కాలేజీలను ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారో.. పీజీ కౌన్సెలింగ్‌కు సంబంధించి కూడా అలానే ఇబ్బంది పెట్టేందుకు జేఎన్టీయూ ప్రయత్నిస్తోందని కాలేజీల తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. మార్చి, ఏప్రిల్ నెలల్లో తనిఖీలు నిర్వహించిన వర్సిటీ ఇన్ని నెలలు మౌనంగా ఉండి.. ఇప్పుడు చివరి నిమిషంలో లోపాలు ఉన్నాయంటూ చెప్పడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. వర్సిటీ లేవనెత్తిన లోపాలను సవరించుకున్నామని, ఆ విషయాన్ని చెబుతుంటే పట్టించుకునే అధికారే లేరని కోర్టుకు తెలిపారు. అసలు జేఎన్టీయూను తాము నమ్మే పరిస్థితుల్లో లేమన్నారు. జేఎన్టీయూహెచ్ అరాచకంగా వ్యవహరిస్తోందని.. వర్సిటీ తీరును పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. నిర్ణయం తీసుకోలేదు: అడ్వొకేట్ జనరల్ పీజీ కౌన్సెలింగ్ జాబితాకు సంబంధించి ఏ నిర్ణయమూ తీసుకోలేదని వర్సిటీ తరఫున అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి కోర్టుకు తెలిపారు. కాలేజీలు బోధనా సిబ్బంది, వారి అర్హతలు, విద్యార్థి, ఉపాధ్యాయ నిష్పత్తి, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన వివరాలను సమర్పిస్తే... వాటిని పరిశీలించి అఫిలియేషన్‌పై నిర్ణయం తీసుకుంటామని, తర్వాత వెబ్ కౌన్సెలింగ్ జాబితాలో చేరుస్తామని చెప్పారు. కాలేజీలు సమర్పించే వివరాలు సరిగా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు స్వయంగా కాలేజీలకు వెళ్లి తనిఖీలు నిర్వహిస్తామని.. నిబంధనల మేరకు అఫిలియేషన్‌ను వెంటనే రద్దు చేస్తామని తెలిపారు.

అన్నింటినీ ఒకే గాటన కట్టొద్దు..
లోపాల విషయంలో అన్ని కాలేజీలను ఒకే గాటన కట్టడం సరికాదని జస్టిస్ రాజశేఖరరెడ్డి వ్యాఖ్యానించారు. ఎంసెట్ కౌన్సెలింగ్ సమయంలో వర్సిటీ వ్యవహరించిన తీరును చూసి పిటిషనర్లు ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోం దన్నారు. అన్ని కాలేజీలను కౌన్సెలింగ్ జాబి తాలో చేర్చాలని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వు లు జారీ చేశారు. కాగా.. ఈ మధ్యంతర ఉత్తర్వులపై అప్పీలు చేయాలని జేఎన్టీయూహెచ్ ప్రాథమికంగా నిర్ణయించింది. దీనిపై వర్సిటీ అధికారులు అడ్వొకేట్ జనరల్‌తో చర్చిస్తున్నారు.
Published date : 05 Sep 2014 12:21PM

Photo Stories