ఐఐటీ ప్రవేశ పరీక్షల్లో భారీ మార్పులు
Sakshi Education
న్యూఢిల్లీ: దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షల ప్రక్రియలో భారీ మార్పులు చేయాలని ఉన్నతస్థాయి కమిటీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. నాలుగు లక్షల మంది విద్యార్థులను షార్ట్‌లిస్ట్ చేసే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) పరీక్ష కోసం ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఎన్‌టీఎస్)ను ఏర్పాటు చేయాలని సూచించింది.
జేఈఈ పరీక్షల ప్రక్రియలో మార్పులను 2017 తర్వాతే చేపట్టాలని సూచించింది. కాగా, 2016 జేఈఈ పరీక్ష 2015లో మాదిరిగానే జరగనుంది. అయితే జేఈఈ(అడ్వాన్స్‌డ్) స్టేజ్‌లో పోటీపడేవారి సంఖ్యను 1.5 లక్షల నుంచి 2 లక్షలకు పెంచింది. ఈ మేరకు ప్రొఫెసర్ అశోక్ మిశ్రా నేతృత్వంలోని ఎమినెంట్ పర్సన్స్ కమిటీ(సీఈపీ) గత వారంలో తమ నివేదికను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖకు సమర్పించింది. ఐఐటీల్లో ప్రవేశాలు కోరుకునే విద్యార్థులు కోచింగ్ సెంటర్లపై ఆధారపడకుండా ఉండేందుకుగానూ పలు కీలక మార్పులు చేయాలని సూచించింది. కమిటీ సిఫార్సుల ప్రకారం.. 2016 ప్రారంభంలో ఎన్‌టీఎస్‌ను ఏర్పాటు చేస్తారు. విద్యార్థుల్లో శాస్త్రీయ థృక్ఫథం, సృజనాత్మక ఆలోచనా సామర్థ్యం పరీక్షించేందుకు ఎన్‌టీఎస్ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లను నిర్వహిస్తుంది. పూర్తిగా ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహించే ఈ ఆప్టిట్యూడ్ టెస్ట్‌లు ఏడాదికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సార్లు నిర్వహించే అవకాశం ఉంది. ఇందులో చూపిన ప్రతిభ ఆధారంగా జేఈఈ పరీక్షల్లో సుమారు నాలుగు లక్షల మందిని షార్ట్‌లిస్ట్ చేస్తారు. జేఈఈ(అడ్వాన్స్‌డ్) మాదిరిగానే ఐఐటీలే నిర్వహించే ఈ పరీక్షల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లో విద్యార్థుల పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. వీటి ఆధారంగా కామన్ కౌన్సెలింగ్‌లో ఐఐటీల్లోని 40 వేలకుపైగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకుగానూ విద్యార్థులకు ర్యాంకులను కేటాయిస్తారు. విద్యార్థులను కోచింగ్ సెంటర్ల నుంచి బయటకు రప్పించేందుకుగానూ ఐఐటీలు మాక్ జేఈఈ పరీక్షలకు నిర్వహించేందుకు ప్రత్యేక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని కూడా కమిటీ సూచించింది. అలాగే ఈ ఏడాది ఎన్‌ఐటీలు, సీఎఫ్‌టీఐల్లో ప్రవేశాల కోసం ఇచ్చే ర్యాంకుల్లో బోర్డు మార్కులను పరిగణనలోకి తీసుకోవద్దని మరో కీలక సూచన చేసింది. కాగా, కమిటీ సిఫార్సులపై విస్తృత సంప్రదింపుల నిమిత్తం మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రజలకు అందుబాటులో ఉంచనుంది.
Published date : 09 Nov 2015 12:24PM