Skip to main content

ఐఐటీ జేఈఈ అడ్వాన్స్డ్‌లో తెలుగు విద్యార్థుల హవా

హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీ-జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. జాతీయస్థాయిలో టాప్-10లో ఐదు ర్యాంకులు మనోళ్లే చేజిక్కించుకున్నారు. జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో 2వ ర్యాంకును తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లా ముత్పూర్‌కు చెందిన చింతకింది సాయి చేతన్ సాధించగా, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన రావూరు లోహిత్ 4వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. టాప్-25 ర్యాంకుల్లో తెలంగాణకు చెందిన ఆరుగురు విద్యార్థులు ఉండగా, మరో ఐదు ర్యాంకులను ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు సాధించారు. టాప్-100 లోపు ర్యాంకుల్లోనూ దాదాపు 50 వరకు ర్యాంకులను తెలుగు తేజాలే చేజిక్కించుకోవడం విశేషం. హైదరాబాద్‌లోని శ్రీ గాయత్రి విద్యా సంస్థల్లో చదివిన పాటియాలా(పంజాబ్) విద్యార్థి జి.శుభం గోయల్‌కు 6వ ర్యాంకు లభించింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా 1,26,997 మంది దరఖాస్తు చేసుకోగా.. వీరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందినవారు 21,861 మంది ఉన్నారు. ఈ పరీక్షలో దేశవ్యాప్తంగా అర్హత సాధించిన 27,151 మందిలో ఉభయ రాష్ట్రాలకు చెందినవారు దాదాపు 2వేల మంది ఉన్నారని సమాచారం.

నేటినుంచి చాయిస్..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించిన విద్యార్థులు తమకు ఇష్టమైన కాలేజీలో చేరేందుకు అవసరమైన చాయిస్ ఇచ్చుకునేందుకు జేఈఈ అడ్వాన్స్‌డ్ అవకాశం కల్పించింది. ఈనెల 20 నుంచి 24 వరకు విద్యార్థులు చాయిస్ ఇచ్చుకోవచ్చని పేర్కొంది. జులై 1న మొదటి దశ సీట్ల కేటాయింపు జాబితాను ప్రకటిస్తారు. ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ రూర్కీలో అందుబాటులో ఉన్న బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో సీటు కావాలనుకునేవారు కూడా ఈనెల 20 నుంచి 24 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వారు అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించి ఉండాలి. 26న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష నిర్వహించి 29న ఫలితాలను ప్రకటించనున్నారు. మరోవైపు ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్ అల్‌ఇండియా ర్యాంకులను జులై 7న ప్రకటిస్తామని సెంట్రల్ బోర్డు ఆఫ్ సెంకడరీ ఎడ్యుకేషన్ గతంలో షెడ్యూల్ జారీచేసినా, జూలై ఒకటో తేదీనే ఆ ర్యాంకులు వెల్లడించే అవకాశం ఉంది.

అడ్వాన్స్‌డ్ చాయిస్, సీట్ల కేటాయింపు షెడ్యూల్
ఈనెల 20 నుంచి 24 వరకు: ఆన్‌లైన్‌లో చాయిస్‌కు అవకాశం, 26న: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష, 29న: ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ పరీక్ష ఫలితాలు, జులై 1న: మొదటి దశ సీట్ల కేటాయింపు, జులై 4లోపు: ఫీజు చెల్లింపునకు అవకాశం, జులై 7న: రెండో దశ సీట్ల కేటాయింపు, జులై 10లోపు: ఫీజు చెల్లింపునకు అవకాశం, జులై 9 నుంచి 11 వరకు: సీట్ల ఉపసంహరణ, జులై 12న: మూడో దశ సీట్ల కేటాయింపు, జులై 14లోపు: ఫీజు చెల్లింపునకు అవకాశం.

తెలంగాణ ర్యాంకర్లు
హాల్‌టికెట్ నం. పేరు ర్యాంకు జిల్లా
6026142 సాయి చేతన్ 2 మహబూబ్‌నగర్
6007141 సి.జయత్ శంకర్ 5 హైదరాబాద్
6013169 ఎన్.పవన్‌కుమార్ 9 రంగారెడ్డి
6003158 వి.యశ్వంత్‌రెడ్డి 10 నల్లగొండ
6004173 ఎల్.నిఖిల్‌కుమార్ 15 రంగారెడ్డి
6019066 ఆర్.అభినవ్ 25 కరీంనగర్


ఆంధ్ర ప్రదేశ్ ర్యాంకర్లు
హాల్‌టికెట్ నం. పేరు ర్యాంకు జిల్లా
6008003 లోహిత్ 4 చిత్తూరు
6015181 కె.ఉదయ్ 11 కర్నూలు
6010141 ఎన్.దివాకర్‌రెడ్డి 12 కర్నూలు
6007161 కె.వీరవెంకటసతీష్ 14 తూర్పుగోదావరి
6010061 జి.చాణుక్యవర్ధన్‌రెడ్డి 18 ప్రకాశం


వివరాలు అందాల్సిన ర్యాంకర్లు
6043024 వి.ప్రమోద్ 16
5004256 వి.ఆదిత్యవర్థన్ 17
6008298 ఎం.సాయి అరవింద్ 20
2021022 స్రజన్ గార్గ్ 21
6020177 వై.వినయ్ 23
Published date : 20 Jun 2014 11:13AM

Photo Stories