Skip to main content

27 ఇంజనీరింగ్ కాలేజీల్లోప్రవేశాలకు అనుమతి నిరాకరణ

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఈ సారి 27 ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకు జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ) అనుమతి నిరాకరించింది. దీంతో వాటిల్లోని దాదాపు 8 వేలకు పైగా సీట్లు రద్దయ్యాయి.
జేఎన్‌టీయూ ఇటీవల కాలేజీలకు జారీ చేసిన అనుబంధ గుర్తింపు లెక్కలు తేలాయి. రాష్ట్రంలోని 183 ఇంజనీరింగ్ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా జేఎన్‌టీయూ 156 కాలేజీలకు గుర్తింపును జారీ చేసింది. దీంతో 27 కాలేజీలకు ఈసారి బీటెక్‌లో ప్రవేశాలు చేపట్టడానికి వీల్లేదు. అయితే వాటిల్లో ఎక్కువ శాతం కాలేజీల్లో వసతులు లేని కారణంగా అనుబంధ గుర్తింపును జేఎన్‌టీయూ నిరాకరించింది. మరికొన్ని కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ గతంలో ప్రవేశాలు లేని కారణంగా చివరలో విరమించుకున్నాయి. దీంతో ఆయా కాలేజీలతోపాటు ఇతర కాలేజీల్లో 8 వేలకు పైగా సీట్లు రద్దయ్యాయి. గతేడాది రాష్ట్రంలోని 202 కాలేజీల్లో ప్రవేశాల కోసం యాజమాన్యాలు అనుబంధ గుర్తింపు ఇవ్వాలని జేఎన్‌టీయూకు దరఖాస్తు చేసుకున్నాయి. వాటిల్లోని 174 కాలేజీల్లో 793 కోర్సులకు సంబంధించిన 86,176 సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ఈ సారి 183 కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంటే అందులో 156 కాలేజీల్లోని 686 కోర్సులకు సంబంధించి 77,500 సీట్ల భర్తీకి అనుబంధ గుర్తింపును జారీ చేసింది. వీటితోపాటు ఫార్మసీ ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్ కోర్సులకు, కాలేజీలకు కూడా అనుబంధ గుర్తింపును జారీ చేసింది. ఫార్మసీలో గతేడాది 76 కాలేజీలకు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా, 73 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ఈ సారి 73 కాలేజీలు దరఖాస్తు చేసుకోగా, అందులో 67 కాలేజీలకు గుర్తింపు ఇచ్చింది. గతేడాది 17 ఎంబీఏ, ఎంసీఏ కాలేజీలు దరఖాస్తు చేసుకుంటే 16 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. ఈ సారి 13 కాలేజీలు దరఖాస్తు చేసుకుంటే 11 కాలేజీలకే అనుబంధ గుర్తింపు ఇచ్చింది.

కోర్సుల వారీగా అనుబంధ గుర్తింపు వివరాలు..
కోర్సు కాలేజీలు సీట్లు కాలేజీలు సీట్లు
బీటెక్ 156 77,500 174 86,176
బీఫార్మసీ 74 6,020 82 6,520
ఎంటెక్ -- 4,542 74 5,685
ఎం.ఫార్మసీ -- -- 66 2,460
ఎంబీఏ 132 9,945 138 12,675
ఎంసీఏ 03 180 03 180
Published date : 10 Jun 2019 04:33PM

Photo Stories