25న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష.. ఐదు చోట్ల నిర్వహణకు ఏర్పాట్లు
Sakshi Education
హైదరాబాద్: ఐఐటీలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఈనెల 25వ తేదీన నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపరు-1 పరీక్ష జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పేపరు-2 పరీక్ష ఉంటుంది. ఐఐటీలో చేరాలంటే విద్యార్థులు జేఈఈ-అడ్వాన్స్‌డ్ పరీక్షలో ర్యాంకు సాధించాలి. దీనికి జేఈఈ-మెయిన్‌లో 1,54,000 లోపు ర్యాంకు సాధించిన వారు అర్హులు. పరీక్షకు రాష్ట్రం నుంచి 21,818 మంది అర్హత సాధించారు. అడ్వాన్స్‌డ్ పరీక్షలో కేటగిరీ వారీగా అభ్యర్థులు సాధించిన జాతీయ స్థాయి ర్యాంకుల ఆధారంగా ఐఐటీ సీట్లు కేటాయిస్తారు. అయితే వీరంతా ఆయా రాష్ట్రాల బోర్డులు నిర్వహించిన 12వ తరగతి పరీక్షల్లో టాప్ 20 పర్సంటైల్‌లో ఉండాలి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, నెల్లూరు, విశాఖపట్నంలలో పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ఈసారి ఇంటర్మీడియట్ మార్కుల టాప్-20 పర్సంటైల్‌ను ఉమ్మడిగానే నిర్ధారించనున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వచ్చే ఏడాది వేర్వేరు రాష్ట్రాలకు వేర్వేరుగా పర్సంటైల్ ఉండనుంది. టాప్-20 పర్సంటైల్‌కు కటాఫ్ మార్కుల నిర్ధారణపై ఇంటర్ బోర్డు వర్గాలు ఆలోచనలో పడ్డాయి. గత ఏడాది బోర్డు ప్రకటించిన పర్సంటైల్ కటాఫ్‌పై కొందరు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కటాఫ్ మార్కులను, పర్సంటైల్‌ను తాము నిర్ధారించకపోవచ్చని ఇంటర్ బోర్డు వర్గాలు చెబుతున్నాయి. ఐఐటీ అడ్వాన్స్‌డ్ నిర్వాహక సంస్థకు ఫలితాల సీడీని పంపి వారినే నిర్ధారించాల్సిందిగా సూచించాలని బోర్డు వర్గాలు భావిస్తున్నాయి.
- జూన్ 1న వెబ్‌సైట్‌లో కీ ప్రకటన.
- జూన్ 8 నుంచి 11 వరకు వెబ్‌సైట్‌లో ఓఆర్‌ఎస్ షీట్లు.
- జూన్ 19న ఫలితాలు
- జూన్ 26న ఆర్కిటెక్చర్‌ఆప్టిట్యూడ్ టెస్ట్
- జూన్ 29న ఆర్కిటెక్చర్ ఫలితాలు
- జూలై 1న మొదటి దశ సీట్లు కేటాయింపు ప్రకటన.
4వ తేదీలోగా ప్రవేశ ఫీజు చెల్లింపునకు అవకాశం. - జూలై 7న రెండో దశ సీట్లు కేటాయింపు.
ప్రవేశ పీజు చెల్లింపునకు చివరి తేదీ జులై 10. - జూలై 9 నుంచి 11 వరకు సీట్ల ఉపసంహరణ, ఫీజు రీ ఫండ్.
- జూలై 13న మూడో దశ సీట్లు కేటాయింపు.
ప్రవేశ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ జూలై 14.
Published date : 19 May 2014 11:52AM