Skip to main content

23 పట్టణాల్లో జేఈఈ మెయిన్ ఆన్‌లైన్ పరీక్ష- హైదరాబాద్‌లో ఆఫ్‌లైన్ మాత్రమే

హైదరాబాద్: జేఈఈ-మెయిన్స్ 2014 పరీక్ష ను ఈసారి రాష్ట్రంలోని 23 పట్టణాల్లో ఆన్‌లైన్‌లో రాసే సౌలభ్యం కల్పించారు. జేఈఈ-మెయిన్ 2013 పరీక్ష సందర్భంగా తలెత్తిన సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈసారి ఆన్‌లైన్ పరీక్ష కోసం సీబీఎస్‌ఈ అనేక పట్టణాలను ఎంపిక చేసింది. మన రాష్ట్రంలో అనంతపురం, బాపట్ల, భీమవరం, చీరాల, చిత్తూరు, ఏలూరు, గూడూరు, కడప, కాకినాడ, కంచకర్ల, కరీంనగర్, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, నరసరావుపేట, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం పట్టణాల్లో ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటుచేశారు. వరంగల్, ఖమ్మం, తిరుపతి, గుంటూరులతో పాటు హైదరాబాద్‌లో ఆఫ్‌లైన్ పరీక్ష రాసేందుకు కేంద్రాలను ఏర్పాటుచేయనున్నారు. అయితే హైదరాబాద్‌లో గతంలో ఉన్న రీతిలో ఆన్‌లైన్‌లో పరీక్ష రాసేందుకు ఇప్పుడు అవకాశం లేకుండాపోయింది.

సహాయక కేంద్రాల ఏర్పాటు: ఏప్రిల్ 6న ఆఫ్‌లైన్‌లో, ఏప్రిల్ 9, 11, 12, 19 తేదీల్లో ఆన్‌లైన్ విధానంలో జరగనున్న జేఈఈ-మెయిన్-2014 పరీక్షకు ఈ నెల 15న దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. వీటిని ఆన్‌లైన్‌లో డిసెంబర్ 26 వరకు మాత్రమే స్వీకరిస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు నింపే ప్రక్రియలో సహకరించేందుకు రాష్ట్రంలో 15 సహాయక కేంద్రాలను ఏర్పాటుచేశారు. హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్, హిమాయత్‌నగర్‌లోని హోవర్డ్ పబ్లిక్ స్కూల్, సికింద్రాబాద్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, విజయవాడలోని వీపీ సిద్దార్థ పబ్లిక్ స్కూల్, ఎన్.సెయింట్ మాథ్యూస్ పబ్లిక్ స్కూల్, గుంటూరులోని శ్రీవెంకటేశ్వర బాలకుటీర్, తిరుపతిలో కేంద్రీయ విద్యాలయం నంబరు 1, భారతీయ విద్యాభవన్, అనంతపురంలో శ్రీసత్యసాయి స్కూల్, వరంగల్‌లో వరంగల్ పబ్లిక్ స్కూల్, విశాఖలో వికాస్ విద్యానికేతన్, రామనాథ్ సెకండరీ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఖమ్మంలో హార్వెస్ట్ పబ్లిక్ స్కూల్లో ఈ సహాయక కేంద్రాలను ఏర్పాటుచేశారు.
Published date : 26 Nov 2013 10:50AM

Photo Stories