23 ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు
Sakshi Education
అనంతపురం విద్య: జేఎన్‌టీయూ అనంతపురం పరిధిలోని 23 ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపును రద్దు చేశారు.
2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల నిర్వహణకు అనుమతి మంజూరులో భాగంగా సోమవారం పాలకమండలి అత్యవసర వర్చువల్ సమావేశం జరిగింది. ఇందులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జేఎన్‌టీయూఏ పరిధిలోని అనంతపురం, వైఎస్సార్ కడప, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో మొత్తం 138 ఇంజనీరింగ్, ఫార్మసీ కళాశాలలున్నాయి. ఇందులో 23 ఇంజనీరింగ్ కళాశాలల రద్దుకు పాలకమండలి ఆమోద ముద్ర వేసింది. కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలు తీసికట్టుగా మారడం, అర్హులైన బోధనా సిబ్బంది లేకపోవడం, గత మూడు విద్యా సంవత్సరాలు వరుసగా 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు... వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని 23 ఇంజనీరింగ్ కళాశాలలను రద్దు చేశారు. మొత్తం 41 వేల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, 5 వేల సీట్లు తగ్గించారు. 2020-21 విద్యా సంవత్సరానికి జేఎన్‌టీయూఏ పరిధిలో 36 వేల ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇంజనీరింగ్ 81 కళాశాలలు, ఫార్మసీ 34 కళాశాలలకు జేఎన్‌టీయూఏ గుర్తింపునిచ్చింది. ఇందులోనే 2020-21కి బీటెక్, బీఫార్మసీ సీట్లు కేటాయిస్తారు. మరోవైపు జేఎన్‌టీయూఏకు చెల్లించాల్సిన యూసీఎస్ (యూనివర్సిటీ కామన్ సర్వీసెస్ ఫీజు) బకాయిలు 2017-18 విద్యా సంవత్సరం ముగిసే నాటికి ఎంత ఉంటుందో అంతే మొత్తాన్ని వర్సిటీ కట్టించుకోవాలని పాలకమండలి తీర్మానించింది.
Published date : 10 Nov 2020 02:51PM