Skip to main content

ఆ 174 ఇంజనీరింగ్ కాలేజీలకు మొండిచేయి

హైడ్రామా అనంతరం తేల్చిన జేఎన్‌టీయూహెచ్

హైదరాబాద్: అఫిలియేషన్ల వ్యవహారంలో ఇంజనీరింగ్ కాలేజీలకు మరోసారి నిరాశే ఎదురైంది. లోపాలను సరిదిద్దుకుంటామని అఫిడవిట్లు అందజేసిన 174 కళాశాలలకు రెండు రోజుల హైడ్రామా అనంతరం జేఎన్‌టీయూహెచ్ మొండిచేయి చూపింది. లోపాలను సరిదిద్దుకునే కాలేజీలకు అఫిలియేషన్లు ఇస్తామంటూ జేఎన్‌టీయూహెచ్ వర్గాలు బుధవారం పేర్కొన్న నేపథ్యంలో సర్కారు సీరియస్ అయినట్లు తెలిసింది. ప్రభుత్వంతో చర్చించకుండా ఆలాంటి కీలక నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో జేఎన్‌టీయూహెచ్ అధికారులు వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. గురువారం ఉదయమే తమ కళాశాలల జాబితా.. ప్రవేశాల కౌన్సెలింగ్‌కు వెళ్తుందని ఆశించిన యాజమాన్యాలు ఈ పరిణామంతో కంగుతిన్నాయి. మరోవైపు జేఎన్‌టీయూహెచ్ నుంచి అఫిలియేషన్ లభించిన కాలేజీల జాబితా గురువారం మధ్యాహ్నంలోగా తమకు అందితే మొదటి కౌన్సెలింగ్‌లో పెట్టి, గడువు పొడగించే అవకాశం ఉండేదని.. అవి రాకపోవడంతో మొదటి దశ కౌన్సెలింగ్ ముగిసిందని ఏపీ ఉన్నత విద్యామండలి ప్రకటించింది. దీంతో యాజమాన్యాలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నాయి.

యూనివర్సిటీ నిజనిర్ధారణ కమిటీలు ఈ విద్యా సంవత్సరంలో రెండుసార్లు తనిఖీలు చేసి 174 కళాశాలల్లో లోపాలున్నట్లుగా గుర్తించి డీఅఫిలియేషన్‌కు సిఫార్సు చేశాయి. దీంతో వర్సిటీ ఆ కాలేజీలకు అఫిలియేషన్లను నిరాకరించింది. అనంతరం బాధిత కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా.. అర్హతలున్న కళాశాలలకు అఫిలియేషన్లు ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు ఈనెల 25లోగా లోపాలను సరిదిద్దుకుంటే అఫిలియేషన్లు ఇస్తామని కాలేజీలకు జారీచేసిన నోటీసుల్లో జేఎన్‌టీయూహెచ్ పేర్కొంది. కానీ చివరకు మొండిచేయి చూపారని యాజమాన్య ప్రతినిధులు పేర్కొంటున్నారు.

కోర్టుకు వెళ్లే యోచన?
అఫిలియేషన్ల వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలను కూడా జేఎన్‌టీయూహెచ్ అమలు చేయడంలేదని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. అవసరమైతే కోర్టు ధిక్కారం కేసు వేస్తామని ఓ యాజమాన్య ప్రతినిధి పేర్కొన్నారు.
Published date : 30 Aug 2014 12:02PM

Photo Stories