Skip to main content

17 నుంచి తెలంగాణ ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు

సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం శుక్రవారం (ఈనెల 17) నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
కాలేజీలకు అఫిలియేషన్ల వ్యవహారంపై బుధవారం హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య, జేఎన్టీయూహెచ్ ఇన్‌చార్జి వీసీ శైలజారామయ్యర్, రిజిస్ట్రార్ ఎన్‌వీ రమణారావు తదితరులు హాజరైన ఈ సమావేశంలో... కోర్టులో జరిగిన వాదనలు, తీర్పు సారాంశం ప్రకారం ముందుకు సాగాలని ప్రాథమికంగా నిర్ణయించారు. అయితే హైకోర్టు తీర్పు కాపీ బుధవారం రాత్రి వరకు అధికారికంగా అందకపోవడంతో ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించలేదు. తీర్పు ప్రతిలో ఏముంటుందో తెలియదు కనుక.. అది అందిన వెంటనే దానిలోని అంశాలను బట్టి గురువారం అధికారికంగా నిర్ణయాన్ని ప్రకటించాలని నిర్ణయించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో చర్చించి ప్రకటన జారీ చేయనున్నారు. ఇక ఎంసెట్‌లో అర్హత సాధించిన 90,556 మంది విద్యార్థుల్లో 66,308 మంది ఇప్పటికే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకున్నారు. ఇక తదుపరి ప్రక్రియ వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు చేపట్టడమే. ఈ నేపథ్యంలో 17వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లను ప్రారంభించి.. ఒకటీ రెండు దశల్లో ప్రవేశాలను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈనెల 31 నాటికి ప్రవేశాలను పూర్తిచేసి, ఆగస్టు ఒకటిన తరగతులను ప్రారంభించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

తీర్పు ప్రతి కోసం..
మొదటి దశ ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లు, సీట్ల కేటాయింపు, కాలేజీల్లో రిపోర్టింగ్, తర్వాతి రెండో దశ ప్రక్రియ తేదీలను గురువారం ఉన్నత విద్యా మండలి అధికారికంగా ప్రకటించనుంది. బుధవారమే కోర్టు తీర్పు ప్రతి అందితే షెడ్యూల్ ప్రకటించి గురువారం నుంచి (16వ తేదీ) ప్రక్రియ చేపట్టాలని ఇదివరకే నిర్ణయించి, షెడ్యూల్‌ను కూడా సిద్ధం చేసుకున్నారు. కానీ కోర్టు తీర్పు ప్రతి అందనందున 17వ తేదీ నుంచి ప్రక్రియ కొనసాగించేలా మార్పులు చేస్తున్నారు. దాని ప్రకారం... ఈ నెల 17 నుంచి 20వ తేదీ వరకు వెబ్‌ఆప్షన్లు, 21న ఆప్షన్లలో మార్పులు, 23న సీట్ల కేటాయింపు జరిపే అవకాశముంది. విద్యార్థులు 27వ తేదీ వరకు కాలేజీల్లో చేరేలా చర్యలు చేపట్టనున్నారు. రెండోదశలో 28, 29 తేదీల్లో వెబ్‌ఆప్షన్లు, 30న సీట్ల కేటాయింపు, 31న కాలేజీల్లో చేరేలా చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు. మొత్తంగా ఆగస్టు 1 నుంచి తరగతులను ప్రారంభించేలా షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

20వ తేదీ నుంచి సంయుక్త తనిఖీలు
హైకోర్టు ధర్మాసనం ఆదేశాల మేరకు ఈనెల 20వ తేదీ నుంచి ఏఐసీటీఈ, జేఎన్టీయూహెచ్‌ల ఆధ్వర్యంలో కాలేజీల్లో తనిఖీలను చేపట్టనున్నారు. ఇందుకోసం చేపట్టాల్సిన చర్యలపై జేఎన్టీయూహెచ్ దృష్టి సారించింది. అఫిలియేషన్లు కోరుతూ, సీట్ల కోతను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించిన కాలేజీల్లో దాదాపు 25 బృందాలు ఈ తనిఖీలను చేపట్టనున్నాయి. ప్రతి కాలేజీకి తనిఖీలకు వెళ్లే తేదీ వివరాలను 48 గంటల ముందే తెలియజేసి మరీ సంయుక్త బృందాలు తనిఖీలకు వెళ్లేలా జేఎన్టీయూహెచ్ కసరత్తు చేస్తోంది. విద్యార్థులకు పూర్తి వివరాలు తెలిసేలా.. మరోవైపు అదనపు సీట్లు, అఫిలియేషన్లు కోరుతూ కోర్టును ఆశ్రయించిన కాలేజీలు, బ్రాంచీలకు సంబంధించిన సమగ్ర సమాచారం విద్యార్థులకు వెబ్ ఆప్షన్లు ఇచ్చే సమయంలోనే తెలిసేలా చేర్చేందుకు చర్యలు చేపడుతున్నారు. వాటిని ఎంచుకుంటే తదుపరి తనిఖీలకు లోబడి అడ్మిషన్లు ఉంటాయన్న వివరాలను స్పష్టం చేయనున్నారు.
Published date : 16 Jul 2015 10:54AM

Photo Stories