Skip to main content

13 జిల్లాలకు రెండే జేఈఈ కేంద్రాలు

జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాల ఏర్పాటులో ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు, విభజన అనంతరం ఏపీలో 13 జిల్లాలకు కేవలం రెండే ఆఫ్‌లైన్ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలూ 22 మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు.
  • జేఈఈ మెయిన్స్‌లో ఏపీకి అన్యాయం
  • గుంటూరు, తిరుపతిలోనే ఆఫ్‌లైన్ కేంద్రాలు
  • ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల విద్యార్థులకు కష్టాలే
  • అనంతపురం, రాజమండ్రి, విశాఖలో ఆఫ్‌లైన్ కేంద్రాల ఏర్పాటుకు వినతి
ఏలూరు: ఐఐటీ అంటే దేశంలోనే ముందుగా గుర్తుకు వచ్చేది ఆంధ్రప్రదేశ్. ఐఐటీలలో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈలో ఏపీ విద్యార్థులే ఎక్కువ ప్రతిభ చూపిస్తుంటారు. పెద్దమొత్తంలో ర్యాంకులు సాధిస్తుంటారు. పరీక్ష రాసే విద్యార్థుల సంఖ్య ఆధారంగా చూస్తే జాతీయ స్థాయిలో మన రాష్ట్రం మూడోస్థానంలో ఉంది. జేఈఈ మెయిన్స్-14లో అర్హత సాధించిన విద్యార్థుల సంఖ్యలో దేశంలోనే రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. ఈ పరీక్షలకు మహారాష్ట్ర నుంచి 2,45,582 మంది, యూపీ నుంచి 1,58,451 మంది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి 1,22,862 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. రాష్ట్రం నుంచి 21,818మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న రాష్ట్రానికి జేఈఈ మెయిన్స్ పరీక్ష కేంద్రాల్లో తీరని అన్యాయం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో నాలుగు, విభజన అనంతరం ఏపీలో 13 జిల్లాలకు కేవలం రెండే ఆఫ్‌లైన్ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఆన్‌లైన్ పరీక్ష కేంద్రాలూ 22 మాత్రమే ఏర్పాటు చేస్తున్నారు. మహారాష్ట్రలో 34 ఆఫ్‌లైన్ సెంటర్లు, గుజరాత్‌లో 11, యూపీలో 9, ఒడిశాలో 8 ఆఫ్‌లైన్ సెంటర్లు ఉన్నాయి. విభజన అనంతరం ఏపీలో మాత్రం గుంటూరు, తిరుపతిలలోనే ఆఫ్‌లైన్ పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు ఆఫ్‌లైన్‌లోనే పరీక్ష రాయడానికి మొగ్గు చూపుతున్నారని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. అయితే రెండే కేంద్రాలు ఉండటం వల్ల ఏపీ విద్యార్థులకు.. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల వారికి తీవ్ర ఇబ్బందులు తప్పవని అంటున్నారు. ఉత్తరాంధ్రలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల విద్యార్థులు 400 కిలోమీటర్లకు పైగా దూరంలోని పరీక్ష కేంద్రాలకు వెళ్లాల్సి ఉంది. అనంతపురం, వైఎస్‌ఆర్ జిల్లాల విద్యార్థులు కూడా వంద కిలోమీటర్లపైనే ప్రయాణించి పరీక్షలకు హాజరు కావాలి. దీనివల్ల విద్యార్థులు వ్యయప్రయాసలకు లోనై పరీక్షలు సరిగా రాయలేరని తల్లిదండ్రులు అంటున్నారు. ఏపీలోని రాజమండ్రి, విశాఖ, అనంతపురంలలోనూ ఆఫ్‌లైన్ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జేఈఈ-2015కు దరఖాస్తు చేసుకునేందుకు వచ్చే నెల 18 వరకే గడువుందని, రాష్ట్ర విద్యామంత్రి గంటా శ్రీనివాసరావు, ఉన్నతాధికారులు సత్వరమే స్పందించి మరో 3 కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Published date : 19 Nov 2014 12:31PM

Photo Stories